"గ్రామపంచాయతీగా ఉన్నప్పుడే మంచిగుండే... ఏదన్న చిన్న సమస్యొచ్చినా... ఫోన్ చెయ్యగానే వచ్చేటోళ్లు... ఇప్పుడ మాత్రం అర్జీ పెట్టి నెలలు గడిచినా... వచ్చి చూసే నాథుడే లేడు. వస్తం అంటారు. మర్చిపోతారు. అప్పుడే మంచిగుండే..."
ఇదీ... మీర్‌పేట కార్పొరేషన్ స్థానికుల మనోగతం...! రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్నా... అభివృద్ధిలో మాత్రం మీర్‌పేట కార్పొరేషన్ ఎంతో వెనుకబడిపోయిందని వీరి మాటలే చెబుతున్నాయి.
పంచాయతీ నుంచి కార్పొరేషన్....
మీర్‌పేట ఒకప్పుడు జిల్లెలగూడ గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉండేది. 1995 లో మీర్‌పేటను ప్రభుత్వం తొలిసారిగా గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసింది. 1996 నుంచి 2011 వరకు సర్పంచుల పాలనసాగగా... ఆ తర్వాత మీర్‌పేట, జిల్లెలగూడను జీహెచ్ఎంసీలో విలీనం చేశారు. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో 3 నెలల తర్వాత ఈ రెండు గ్రామాలను మళ్లీ గ్రామ పంచాయతీలుగానే కొనసాగించి... ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించారు. 2016 ఏప్రిల్‌లో మీర్‌పేట, జిల్లెలగూడ పంచాయతీలను పురపాలికలుగా ఏర్పాటు చేశారు. పురపాలికలుగా కొనసాగినప్పటికీ ఎన్నికలు మాత్రం జరగలేదు. మళ్లీ మూడున్నరేళ్లు అధికారులతోనే పాలన సాగింది. ఆరు నెలల కిందట ప్రభుత్వం జిల్లెలగూడ మున్సిపాల్టీని మీర్‌పేటలో విలీనం చేస్తూ.... కార్పొరేషన్‌గా ప్రకటించింది.
మురుగు రోడ్లు... తప్పని పాట్లు...
మీర్‌పేట పంచాయతీ నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగినా... పలు సమస్యలు ఏళ్ల తరబడి ఇక్కడి ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. కార్పొరేషన్ పరిధిలో ప్రధానంగా 3 చెరువులుండగా... ఎగువనున్న కాలనీల నుంచి వచ్చే మురుగు చేరి కలుష్య కాసారాలుగా మారాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు... కాలనీల్లోకి వరద నీరు చేరి దుర్గంధం వెదజల్లుతోంది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోకపోవటం వల్ల దోమలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
వారానికోసారి మాత్రమే మంచినీళ్లు...
6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మీర్ పేట కార్పొరేషన్లో 27 వేల 500 కుటుంబాలు జీవిస్తున్నాయి. లక్షా 21 వేల మంది జనాభా ఉండగా... 83 వేల 569 మంది ఓటర్లున్నారు. 46 వార్డులుగా విభజించి పర్యవేక్షిస్తున్న కార్పొరేషన్‌కు ఏటా రూ.23 కోట్ల ఆదాయం సమకూరుతుండగా... అందులో ప్రజా అవసరాలకు రూ. కోటి 50 లక్షలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. మౌలిక సదుపాయల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించకపోవటంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక తాగునీరైతే వారానికోసారి వస్తున్నాయంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు.
పురపాలక సంఘం నుంచి కార్పొరేషన్ వరకు అంతా ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతుండటం వల్ల ఇప్పటి వరకు ఎన్నికలు జరగలేదు. ఇదే మొదటి సారి కాగా.... ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. ఎస్టీ జనరల్‌కు కేటాయించిన మీర్పేట్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగరేయాలని తెరాస కసరత్తు చేస్తోంది.
ఇవీ చూడండి: తిరుగుబాటు అభ్యర్థుల్ని బుజ్జగిస్తున్న పార్టీలు