MP Komati Reddy Venkat Reddy: శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ మాత్రమేనని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఓ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు మాట్లాడారు.
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రూ.2.90 లక్షల కోట్లు అని గొప్పగా చెప్పారని కోమటిరెడ్డి పేర్కొన్నారు. గతంలోనూ ఈ విధంగానే చెప్పారని.. అందులో ఎంత ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ బడ్జెట్ పూర్తిగా ఎన్నికల బడ్జెట్ మాదిరే ఉందని విమర్శించారు. ఇందులో పేద ప్రజలకు ఎన్ని ఇళ్లు కట్టిస్తామో చెప్పలేదన్నారు. కేసీఆర్ మానస పుత్రిక వంటి మిషన్ భగీరథ పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి సొంత ఊరు నాగారంలో ప్రజలు తాగడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. ఆ గ్రామ ప్రజల బాధ చూడలేక మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయిద్దామని చొరవ తీసుకుంటే.. గ్రామస్థులను బెదిరించి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయిస్తానని ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ మంత్రి సొంతూరులో నీళ్ల సమస్య ఉందని.. కావాలంటే వెళ్లి అక్కడ పరిస్థితి తెలుసుకోవచ్చని తెలిపారు. దీనిపై మంత్రి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. అంకెల గారడీ బడ్జెట్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు.
13 తర్వాత బైక్ లేదా బస్సు యాత్ర: ఈ నెల 13న పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత బైక్ యాత్ర చేస్తున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో బస్సు యాత్ర గానీ, బైక్ యాత్ర గానీ చేపట్టనున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉందని.. 12 నియోజకవర్గాలలో బైక్ యాత్రను త్వరలోనే ప్రారంభిస్తానన్నారు. ఇటు రేవంత్ యాత్రపైనా కోమటిరెడ్డి స్పందించారు. జనంలో ఉన్నప్పుడు పాదయాత్ర.. తర్వాత బస్సు యాత్ర చేస్తున్నారని అన్నారు. బైక్ యాత్ర ద్వారా ప్రతి వ్యక్తినీ కలిసే వీలుంటుందని.. అందుకే తాను బైక్ యాత్ర చేపట్టనున్నట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: