రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ.. హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు ఎట్టకేలకు మోక్షం లభించింది (Hyderabad- Bijapur NH expansion). తాజాగా కేంద్ర జాతీయ రహదారుల, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిధులను మంజూరు చేసింది. హైదరాబాద్ శివారు అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా (vikarabad) మన్నెగూడ వరకు 46.40 కిలోమీటర్ల దూరం 60 మీటర్ల మేర రహదారి విస్తరణకు రూ. 928.41కోట్లను కేటాయించింది.
పదేళ్ల ఆకాంక్ష..
ఇప్పుడున్న రెండు వరుసల రహదారిలో వాహనాల రద్దీ పెరిగి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. పదేళ్ల నుంచి విస్తరించాలని పెద్దఎత్తున డిమాండ్ ఉంది. విస్తరణ తో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్‌తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు మార్గం సుగమం కానుంది. 2018లోనే అనుమతులు మంజూరైనా నిధులు రాక పనులు పట్టాలెక్కలేదు. ఇప్పుడు నిధులు రావడంతో పనులు ప్రారంభం కానున్నాయి.
రోడ్డు ప్రమాదాలకు చెక్: ఎంపీ రంజిత్‌రెడ్డి
బీజాపూర్ మార్గం విస్తరణ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో పాటు వివిధ శాఖల అధికారులను పలుమార్లు కలిసి సమస్యను వివరించా. ఎట్టకేలకు కేంద్రం నిధులు మంజూరు చేయడం సంతోషంగా ఉంది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని వాసులకు రహదారి విస్తరణ ఎంతో ఉపయోగకరం కానుంది. త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. తద్వారా రహదారి ప్రమాదాలకు అడ్డుకట్ట పడనుంది.
ఇదీ చూడండి: రికార్డు: 24 గంటల్లో 40కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం