రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ వాహనదారుడు హాల్చల్ చేశాడు. పట్టణంలో తనిఖీలు నిర్వహించే క్రమంలో... ఓ వాహనదారున్ని పోలీసులు ఆపారు. సదరు వాహనదారుడు ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేయగా... సిబ్బంది అడ్డుపడి ఆపారు. దానికి ఆ వాహనదారుడు పోలీసులపై ఫైర్ అయ్యాడు. రోడ్లపై వాహనాలు ఆపుతూ... ప్రజల సమయాన్ని వృథా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాహనం ఎందుకు ఆపటం లేదని ప్రశ్నిచగా... మీరు ఆపితే ఆగాల్సిన అవసరం తనకు లేదని వాగ్వాదం చేశాడు.
పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వినకపోగా... తిరిగి వారినే ప్రశ్నిస్తూ హల్చల్ చేశాడు. సీఎం అయినా, మంత్రి అయినా, పోలీసులు అయినా... ప్రజల కంటే గొప్పవాళ్లు కాదని నొక్కి చెప్పాడు. తాము ఇచ్చే జీతం మీదనే బతుకుతూ... సేవ చేయకపోగా వేధిస్తున్నారని ఆరోపించాడు. చివరికి పోలీసులకు బండి ఇచ్చాడు. "ఏం చేస్తారో చేయండి" అంటూ తాను పోలీసుల అదుపులోకి వెళ్లాడు.