Shivraj Singh Chouhan visits Kanha Shanti Vanam: నిత్య జీవితంలో యోగా, ధ్యానం అలవరుకోవడం వల్ల చక్కటి ఫలితాలు సిద్ధిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. యోగా వల్ల జీవనశైలిలో మార్పులు వస్తాయని అన్నారు. సహజ్‌మార్గ్ ఆధ్యాత్మిక సంస్థ ఆహ్వానం మేరకు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో ఉన్న కన్హా శాంతి వనంను శివరాజ్‌సింగ్ చౌహాన్ దంపతులు సందర్శించారు. ప్రశాంత వాతావరణం నడుమ సమావేశ మందిరంలో వేల సంఖ్యలో అభ్యాసీలు, రామచంద్ర మిషన్ నిర్వాహకులు, ప్రఖ్యాత యోగా గురువు కమలేష్ పటేల్ దాజీతో కలిసి చౌహాన్ దంపతులు గంటపాటు ధ్యానం చేశారు.
'నశా ముక్తి అభియాన్' కార్యక్రమంపై 'ఎస్‌ఐకెన్' పేరిట ఓ పుస్తకం, మొబైల్‌యాప్‌లను సీఎం శివరాజ్‌సింగ్ విడుదల చేశారు. ధ్యానం వల్ల ఆధునిక జీవనశైలిలో అద్భుతమైన మార్పులే కాకుండా ధైర్యం, సహనశీలత, ప్రేమ వంటి గుణాలు అలవడతాయని పేర్కొన్నారు. శరీరం, బుద్ధి, మనసు, ఆత్మ లాంటి నాలుగు అంశాలు మరింత పటిష్ఠమవుతాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా... ప్రత్యేకించి మన దేశంలో రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థలు అందిస్తున్న సేవలు అమోఘం అని శివరాజ్‌సింగ్ కొనియాడారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం, రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థలు కలిసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా విద్యా రంగంతోపాటు ముక్తి నశా భారత్ అభియాన్ కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. భగవద్గీతలో పలు అంశాలు సహా కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన గీతోపదేశాన్ని శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రస్తావించారు.
తొలి హార్ట్‌ఫుల్‌నెస్ రాష్ట్రంగా మధ్యప్రదేశ్: మహారాష్ట్రలో రామచంద్ర మిషన్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వ సహకారం బాగుందని ప్రఖ్యాత యోగా గురువు కమలేష్ పటేల్ అన్నారు. దేశంలో అన్ని ధర్మాలు శాంతి, సామరస్యం, ఐక్యత బోధిస్తున్నప్పటికీ శ్రీరాముడు, కృష్ణుడు, వినాయకుడు, దుర్గామాత ఇలా దేవుళ్ల పేరిట విడివిడిగా ఉంటూ హిందూ ఐక్యత మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం, మాదక ద్రవ్యాలు, సిగరేట్ వంటి వ్యసనాలకు బానిసై చెడుమార్గంలో నడుస్తున్న యువత, ఇతర వర్గాలను బయట పడేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. దేశంలో తొలి హార్ట్‌ఫుల్‌నెస్ రాష్ట్రంగా మధ్యప్రదేశ్‌ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇవీ చదవండి: