LB Nagar Murder Case Updates : హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది కేసుకు సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. యువకుడి గత నేర చరిత్ర, నిన్నటి దారుణానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన గుండుమల్ల సురేందర్ గౌడ్, ఇందిరమ్మకు ముగ్గురు పిల్లలుండగా.. పెద్ద కుమార్తె సంఘవి రామంతాపూర్‌లోని ఓ కళాశాలలో హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతోంది. రెండో కుమారుడు పృథ్వీ ఇటీవల ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. సంఘవి, పృథ్వీ కొన్నాళ్లుగా ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు.
Hyderabad Youth Attack on Young Woman LB Nagar : కొందర్గు మండలం నేరేళ్ల చెరువుకు చెందిన శివ కుమార్, సంఘవి పదో తరగతి వరకూ షాద్‌నగర్‌లోని ఒకే పాఠశాలలో చదివారు. అప్పటి నుంచి వారిద్దరూ మళ్లీ కలవలేదు. కొన్ని రోజుల క్రితం సామాజిక మాధ్యమంలో మళ్లీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల నుంచి ప్రేమ పేరుతో సంఘవిని శివకుమార్ వేధిస్తున్నాడు. ఆమె ఎన్నిసార్లు తిరస్కరించినా.. పదే పదే వెంటపడుతూ ఇబ్బందిపెట్టినట్లు తెలుస్తోంది. ఎస్సై ఉద్యోగం శిక్షణ కోసమంటూ రామాంతపూర్‌లో నివాసముంటున్న శివకుమార్.. సంఘవిని అనుసరించాడు. ప్రేమ వ్యవహారంపై పదే పదే ఆమె తిరస్కరించినందునే ఆమెపై కక్ష పెంచుకుని కడతేర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Hyderabad Youth killed while Protecting Sister in LB Nagar : ముందే వేసుకున్న పథకం ప్రకారం సంఘవి నివాసముండే ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో చిరునామా తెలుసుకున్న శివకుమార్.. ఆదివారం కత్తిని వెంట తీసుకుని అక్కడికి వెళ్లాడు. యువతి సోదరుడు పృథ్వీ బయటకెళ్లడాన్ని గమనించి ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించాడు. ప్రేమ వ్యవహారం గురించి ప్రస్తావించి ఆమెను కత్తితో బెదిరిస్తూ వాగ్వాదానికి దిగాడు. ఇదే సమయంలో ఇంట్లోకి వచ్చిన పృథ్వీ.. తన సోదరిని బెదిరించటాన్ని చూసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. అప్పటికే విచక్షణ కోల్పోయిన శివ.. పృథ్వీపై కత్తితో దాడి చేసి ఛాతిలో పొడిచాడు. అడ్డుకోబోయిన సంఘవి ముఖంపైనా ఎడాపెడా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పృథ్వీ అక్కడి నుంచి తప్పించుకుని.. కాలనీలోని రోడ్డు మీదకొచ్చి కుప్పకూలాడు.
A Lover Attacked With Knife Young Woman : జగద్గిరిగుట్టలో యువతిపై కత్తితో ప్రేమోన్మాది దాడి
పక్కింటి వాళ్ల తెగువతో నిలిచిన యువతి ప్రాణాలు.. : యువతి ఇంట్లోనే ఉండిపోగా.. శివకుమార్ ఆమెపై గట్టిగా కేకలు వేస్తూ హత మార్చేందుకు ప్రయత్నించాడు. సంఘవి భయంతో కేకలు వేస్తూ ఓ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకోగా.. అరుపులు విని పక్కింటి దంపతులు ఇంటి ముందుకు వెళ్లారు. సంఘవికి ఏదైనా జరిగితే అంతు చూస్తామంటూ హెచ్చరిస్తూ... వారు బయటి నుంచి గడియపెట్టడంతో పారిపోలేని స్థితిలో శివ 15 నిమిషాల పాటు ఇంట్లోనే ఉన్నాడు. ఈలోపే దంపతులు చాకచాక్యంగా మరో ద్వారం గుండా యువతిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తీవ్రంగా గాయపడిన పృథ్వీని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మరణించాడు. మెరుగైన చికిత్స కోసం సంఘవిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది
మూడేళ్ల క్రితం తండ్రినీ ఇలాగే..: నిందితుడు శివకుమార్‌ను విచారించే క్రమంలో తన నేర చరిత్ర, మానసిక ప్రవర్తన బయటకొచ్చినట్లు తెలుస్తోంది. తన సొంతూరులోనూ శివ ఎవరితోనూ మాట్లాడకుండా దూరంగా ఉంటాడని.. సినిమాలంటూ తిరుగుతుండటంతో ఇంట్లో గొడవలు జరిగినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం తండ్రి మందలించటంతో ఆవేశంతో సుత్తితో కొట్టి చంపినట్లు, ఒక్కడే కుమారుడు కావడంతో ఈ విషయాన్ని బయటికి రానివ్వలేదని తెలుస్తోంది. తండ్రి మరణాన్ని సహజ మరణంగా చూపించి తప్పించినా.. తర్వాత కూడా శివకుమార్ ప్రవర్తనలో మార్పు లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
ప్రియురాలు, ఆమె తల్లిని కత్తితో పొడిచిన ప్రేమోన్మాది.. అసలేం జరిగిందంటే?