Birth Anniversary Celebrations of Lalaji Maharaj: శ్రీరామచంద్ర మిషన్ వ్యవస్థాపకుడు, అందరూ అభిమానంగా 'లాలాజీ' అని పిలిచే రామచంద్రజీ మహారాజ్ 150వ జయంతి వారాన్ని పురస్కరించుకుని వైభవంగా జరుగుతున్న సంగీత, ధ్యాన కార్యక్రమాలకు కన్హాశాంతివనం వేదికైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని ఈ శాంతివనంలో సంగీత వేడుకలు శ్రోతలను తన్మయత్వానికి గురిచేస్తున్నాయి.
హార్ట్‌ఫుల్‌నెస్ ట్రస్ట్, శ్రీరామచంద్ర మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3 వరకు జరగనున్న ఈ సంగీత, ధ్యాన పండుగను ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన మార్గదర్శి కమలేశ్ డీ పటేల్ ప్రారంభించారు. తొలిరోజు సామూహిత ధ్యానం సమావేశాలతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం జరిగిన ప్రముఖ భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిట్ అజయ్ చక్రవర్తి కూతురు కౌశికి చక్రవర్తి గానకచేరి మంత్రముగ్దుల్ని చేసింది.
Birth Anniversary Celebrations at Kanha Shanti Vanam: వీనల విందుగా సాగిన తన గానామృతం, సంగీత కచేరితో అభ్యాసకులు తన్మయత్వంలో మునిగి తేలారు. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాలకు చెందిన పెద్దఎత్తున ప్రజలు ఈ ఉత్సవాలకు తరలివచ్చారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలది మంది వీక్షకులు ఆన్‌లైన్‌లో ఈ సంగీత, ధ్యాన వేడుకల్లో పాలుపంచుకుంటున్న కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వటం పట్ల కౌశికి చక్రవర్తి ఆనందం వ్యక్తం చేశారు.
సందర్శకుల సౌకర్యార్థం ప్రపంచంలోని మొట్టమొదటి ‘ఇన్నర్ పీస్’ మ్యూజియాన్ని ప్రపంచ ప్రఖ్యాత ధ్యాన గురువు కమలేశ్ డీ పటేల్ ప్రారంభించారు. ఇందులో లాలాజీ మహారాజ్ స్వయంగా రాసిన బోధనలు, వారి జీవితాన్ని వర్ణించే కళాకృతులు, పెయింటింగ్‌లు, శిల్పాలు, ఇతర ఫలకాలు ప్రదర్శించబడతాయి. సృష్టి ఆది నుంచి మానవాళి అన్వేషిస్తున్న అత్యున్నతమైన అంతరంగ అన్వేషణ ఆకాంక్షకు బీజం వేయటమే, ఈ మ్యూజియం ఉద్దేశమని ట్రస్టు ప్రతినిధులు చెబుతున్నారు.
'ఇంతమంది ఇక్కడికి రావడం, మన హైదరాబాద్లో మంచి ప్రోగ్రాం జరగండం, దాట్లో దాజీవ్గారు మాట్లాడటం. అలాగే కౌశీకి చక్రవర్తిగారు పాట పాడటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి 3 ఏళ్ల నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మా బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ఒకటి పెట్టడం జరుగుతుంది'. -పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ కోచ్
సంగీతం దైవత్వానికి దగ్గరగా తీసుకువెళ్తుందని, అందుకే భారత్‌లో అత్యుత్తమ కళాకారులను ఒకే వేదికపైకి హార్ట్‌ఫుల్‌నెస్ తీసుకువచ్చిందని కార్యక్రమానికి హాజరైన బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ చేపట్టిన ఈ కార్యక్రమాల్లో దేశవిదేశాలకు చెందిన వారితో పాటు జర్మనీకి చెందిన ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, "ది డ్రెస్డెన్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్"కు చెందిన ఆర్ట్ విద్యార్థులు కూడా పాలుపంచుకున్నారు.
10 రోజులపాటు జరిగే ఈ సంగీతోత్సవంలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, రాహుల్ శర్మ, పండిట్ సంజీవ్ అభ్యంకర్, శశాంక్ సుబ్రమణ్యం, సుధా రఘునాథన్, ఉస్తాద్ రషీద్ ఖాన్ వంటి విద్వాంసులు పాల్గొననున్నారు. సంస్కృతిలో భాగమైన ధ్యానం, యోగా ప్రపంచానికి తెలియజేసి అందరూ ఆచరించటమే ఈ ఉత్సవాల లక్ష్యమని కమలేశ్ డీ పటేల్ పేర్కొన్నారు.
ఉత్సవాల కోసం వచ్చిన వేలాది మంది కన్హా శాంతి వనంలో ప్రశాంతత, సానుకూల వాతావరణం దృష్ట్యా అక్కడే బస చేస్తున్నారు. ప్రముఖ విద్వాంసుల సంగీత ప్రతిభను ఆనందించడానికి దేశ, విదేశాల నుంచి వచ్చిన అభ్యాసీలు ఇక్కడే వేచిచూస్తున్నారు.
ఇవీ చదవండి: