Hyderabad Outer Ring Train Project : దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని కేంద్ర పర్యటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. ఈ సర్వే కోసం రూ.14 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రాజెక్టుపై రైల్వేశాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని స్పష్టం చేశారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రైలుతో హైదరాబాద్‌కు ఎంతో మేలు జరగనుందని వివరించారు.
Kishan Reddy on Outer Ring Train : ఆర్ఆర్ఆర్ రూట్ విషయం 99 శాతం కొలిక్కి వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలకు లాభం చేకూరుతుందని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందన్న ఆయన.. సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే వారివారి గమ్యస్థానాలకు వెళ్లేందుకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని చెప్పారు. అనుసంధానంలేని ప్రాంతాలకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ద్వారా అనుసంధానించే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
Kishan Reddy About Outer Ring Rail Project In Hyderabad : వరంగల్ నుంచి కరీంనగర్‌కి రైల్వే లైను సర్వే ప్రారంభం అయిందన్న కిషన్‌రెడ్డి.. ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు ఎంఎంటీఎస్ రెండవ ఫేజ్ చేపట్టాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుందని తెలిపారు. 8 ఏళ్లయినా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇస్తామన్న నిధులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోయినా రూ.330 కోట్ల అంచనాతో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రారంభించాలని ప్రధాని మోదీ రైల్వే మంత్రిని ఆదేశించారని చెప్పారు.
Kishan Reddy on Hyderabad Outer Ring Train Project : రైల్వే శాఖ నిధులతో ఎంఎంటీఎస్ రెండవ దశ ఘట్ కేసర్ నుంచి రాయగిరి వరకు పనులు పూర్తి చేయబోతోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనేక ఆరోగ్య సంస్థలను తెలంగాణలో ఏర్పాటు చేస్తుందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చిందన్న ఆయన.. ఇప్పటి వరకు ఎన్సీడీసీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని ఇవ్వలేదన్నారు. భూమిని కేటాయిస్తే భవన నిర్మాణం చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.
2023 బడ్జెట్లో రూ.500 కోట్లను కేంద్రం కేటాయించిందన్న ఆయన.. భూసేకరణ వేగంగా చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణ సాయం రూ.2102 కోట్లను కేంద్రం ప్రకటించిందని చెప్పారు. వివిధ రంగాల వారిగా మౌలిక సదుపాయాలు మెరుగు పరుచుకునేందుకు ప్రత్యేక ఆర్థిక సాయాన్ని కేంద్రం ప్రకటించిందని వెల్లడించారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇస్తే పెండింగ్ నిధులు ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: