హైదరాబాద్ వనస్థలిపురం డీమార్ట్ వద్ద ఆదివారం రాత్రి... శ్రీచైతన్య కళాశాలకు చెందిన ఇంటర్ విద్యార్థి సతీశ్ మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు కొట్టిన దెబ్బల వల్లే సతీశ్ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
స్నేహితులతో కలిసి రాత్రి షాపింగ్‌కు వెళ్లిన సతీశ్‌కు డీమార్ట్ సెక్యూరిటీకి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సిబ్బంది జరిపిన దాడిలో సతీశ్ చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శ్రీచైతన్య కళాశాల యాజమాన్యంపైనా ఫిర్యాదు చేశారు. సతీశ్‌ను తమ అనుమతి లేకుండా బయటకు పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
శ్రీచైతన్న కళాశాల యాజమాన్య నిర్లక్ష్యం, డీ మార్టు సిబ్బంది దాడికి నిరసనగా లంబాడీ ఐక్య వేదిక సంఘం ఆందోళనలు చేపట్టింది. హయత్ నగర్‌లోని శ్రీచైతన్య కళాశాల వరకు ర్యాలీ చేసి.. కాలేజీ ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.