Inter Student Suicide in naarsingi: కళాశాల యాజమాన్యం ఒత్తిడి భరించలేక.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో చోటుచేసుకుంది. తోటి విద్యార్థులు ఎంత ప్రయత్నించినా అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో సాత్విక్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇతడి స్వస్థలం కేశంపేట మండలం కొత్తపేట గ్రామం.
మార్కులు సరిగా రావడం లేదని గత కొంతకాలంగా కళాశాల యాజమాన్యం ఒత్తిడికి గురిచేయడంతో సాత్విక్ మనస్తాపం చెందాడు. ఒత్తిడి తట్టుకోలేక మంగళవారం రాత్రి తరగతి గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు.. యాజమాన్యానికి చెబితే వారు పట్టించుకోలేదని విద్యార్థులు చెప్పారు. వెంటనే వారు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. అందుబాటులో ఒక్క వాహనం కూడా కనిపించలేదని తెలిపారు. రోడ్డుపైకి వెళ్లి లిఫ్ట్ అడిగి సాత్విక్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు వెల్లడించారు.
స్థానిక ఆస్పత్రికి సాత్విక్‌ను తీసుకెళ్లగా.. డాక్టర్లు పరిశీలించి అప్పటికే అతడు చనిపోయాడని చెప్పారని విద్యార్థులు తెలిపారు. అనంతరం సాత్విక్ కుటుంబానికి సమాచారం అందించినట్లు చెప్పారు. ఆ తర్వాత విద్యార్థి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. కళాశాల యాజమాన్యం వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, మృతుడి తల్లిదండ్రులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Student Committed Suicide By Hanging Himself: కళాశాలలో వేధింపులు, ఒత్తిడి కారణంగానే సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కళాశాల ప్రిన్సిపల్స్ ఆచార్య, కృష్ణారెడ్డి తీవ్రంగా వేధించారని ఆరోపించారు. తోటి విద్యార్థుల ముందే అవమానించేలా మాట్లాడటం, దుర్భాషలాడటంతో సాత్విక్ మానసికంగా కుంగిపోయాడని చెబుతున్నారు. ఘటనకు కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పట్టుబట్టారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి నచ్చజెప్పి, అక్కడి నుంచి తరలించారు.
సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశామని నార్సింగి ఇన్స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్, ఇతర లెక్చరర్లు అవమానపరిచే విధంగా మాట్లాడడం వల్ల తట్టుకోలేక సాత్విక్ మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులు పేర్కొన్నారని శివకుమార్ పేర్కొన్నారు. ఆ మేరకు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని శివకుమార్ తెలిపారు.
విచారణకు ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి: ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు ఆదేశాలు జారీ చేశారు.
"మా పెద్ద అబ్బాయి కళాశాలకు వచ్చి మా తమ్ముడిని ఏమీ అనవద్దు అని చెప్పి వెళ్లాడు. నా చిన్న కొడుకు చాలా సెన్సిటివ్.. మంచిగా మార్కులు అనేవి వస్తాయి. ప్రిన్సిపల్ ఆచార్య నా కుమారుడిపై కక్ష పెంచుకున్నాడు. నీ పని చెప్పుతానని బెదిరించాడు. ప్రిన్సిపల్ నా కుమారుడిని కొట్టాడు. అతని బెదిరింపుల వల్లే సాత్విక్ చనిపోయాడు. వెంటనే కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి." - మృతుని కుటుంబ సభ్యులు
"సర్ వాళ్ల తిట్టడం వల్ల అప్పటికే మెంటల్‌గా డిస్ట్రబ్ అయి ఉన్నాడు. స్టడీ అవర్‌లో నాతో మాట్లాడాలని ఉంది అని అన్నాడు అప్పటికే నాకు అనుమానం వచ్చింది. సాత్విక్‌ను తీసుకొని రూంలోకి వెళ్లాను. మళ్లీ వెళ్లి చూసేసరికి అక్కడ లేడు. అన్ని రూంలు వెతికాము. కనిపించకపోయే సరికి వార్డెండ్కు చెప్పితే.. నాకు తెలియదని అన్నాడు. తర్వాత వాచ్‌మెన్‌కు చెప్పితే.. ఐదు నిమిషాల తర్వాత వచ్చాడు. ఒక గదిలో ఉరివేసుకొని ఉన్న సాత్విక్‌ను నేను నా భుజాలపై వేసుకొని ఆసుపత్రికి తీసుకొని వెళ్లాను. ఆ తర్వాత వేరే వాహనం లిఫ్ట్ ఇవ్వడంతో వెళ్లాము. కొంతసేపు ముందు తీసుకువెళితే బ్రతికేవాడు. దీనికి కళాశాల నిర్లక్ష్యమే కారణం." - మృతుని స్నేహితుడు
ఇవీ చదవండి: