హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం రాత్రి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పండక్కి ఉదయం నుంచే పల్లెబాట పట్టడంతో హైదరాబాద్- విజయవాడ మార్గంలో రద్దీ అధికమైంది. సాయంత్రానికి వాహనాల రద్దీ మరింత పెరిగింది. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ప్రయాణికులు కొయ్యలగూడెంలోని గణపతి దేవాయలం వద్దకు వచ్చే సరికి ముందు వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చౌటుప్పల్ నుంచి నాలుగు కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు గంట సమయం పట్టింది. చౌటుప్పల్‌లో అండర్‌పాస్ వంతెన లేకపోవడంతో పండుగ వేళ, శుభకార్యాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. చౌటుప్పల్ దాటాక వాహనాలు రయ్..మంటూ దూసుకెళ్తున్నాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద ఫాస్టాగ్ విధానం అమలు చేయడంతో అక్కడ ట్రాఫిక్ సాఫీగా సాగిపోతోంది.
ఇదీచూడండి: Alluri Weapons: విల్లుతో ఒకేసారి 4 దిశల్లో నాలుగు బాణాలు సంధించేవారట!