Sri Ramacjandra Mission: సంగీతంతో తెలియని అనుభూతి, ఆధ్యాత్మికత కలుగుతుందని శ్రీరామచంద్రమిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డీ పటేల్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హలో శ్రీరామచంద్రమిషన్ గురూజీ పూజ్యశ్రీ చారీజీ మహారాజ్ 95వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. హార్ట్ పుల్ నెస్ ద్వారా అడవుల సంరక్షణ, పెంపకం కోసం నిధులు సమీకరించేందుకు ఎకోస్ ఆఫ్ బృందావన్ పేరుతో ప్రముఖ ప్లూటిస్ట్ మాస్ట్రో హరిప్రసాద్ చౌరాసియా బృందంతో కచేరి నిర్వహించారు. శ్రీరామచంద్రమిషన్ గ్లోబల్ గైడ్ కమలేష్ డీ పటేల్ ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీఎస్ సోమేశ్ కుమార్, పురపాలక శాఖ ప్రినసిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. మనసు నిశ్చలంగా ఉండేందుకు సంగీతం దివ్యౌషధంగా పనిచేస్తుందని కమలేష్ డీ పటేల్ అభిప్రాయపడ్డారు.
దేవుడు ఈ విశ్వాన్ని మళ్లీ సృష్టిస్తే పురియా కల్యాణ్ రాగ ప్రక్రియను వచ్చే యుగానికి పండిట్‌జీ చౌరాసియా అందిస్తారు. ఈ భూమ్మీద తుదిశ్వాస విడిచే కొన్ని క్షణాల ముందు వరకు పురియా కల్యాణ్ రాగాన్ని పండిట్ జీ ఆలపిస్తారు. మెడిసిన్ న్యూరాలజీ విభాగంలో ఉండే వైద్యులు శాస్త్రీయ సంగీతం ద్వారా లభించే సాంత్వనను పరిశోధించి మరింత ఉన్నతస్థితికి తీసుకుపోవాలి. నిత్యం ధాన్యం ద్వారా మనసుని ప్రశాంతతలో ఉంచితే దైవత్వానికి దగ్గరవుతారు. - కమలేష్ డీ పటేల్, గ్లోబల్ గైడ్, శ్రీరామచంద్ర మిషన్
ప్రజలు దురాశ, అసూయ, అహంకారం వదిలి దైవిక వాతావరణం కల్పించుకోవాలని ప్లూటిస్ట్ మాస్ట్రో హరిప్రసాద్ చౌరాసియా సూచించారు. అభివృద్ధి పేరిట అడవులను నరికేయడం వల్ల ప్రకృతికి చాలా నష్టం జరుగుతుందన్నారు. శ్రీరామచంద్రమిషన్‌లో అపారవృక్షసంపద చూసి ఆశ్చర్యపోయాను అని చౌరాసియా వ్యాఖ్యానించారు. ఇదే తరహాలో మొక్కలు పెంచేందుకు మరిన్ని స్వచ్చంధ సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. భూమండలాన్ని రక్షించేందుకు అడవుల సంరక్షణకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. శ్రీరామచంద్రమిషన్‌లో 7 లక్షల మొక్కలు నాటడంతో పాటు 10వేల భారీ వృక్షాలను ట్రాన్స్ లోకేషన్ పద్దతిలో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. అంతకుముందు హరిప్రసాద్ చౌరాసియా బృందం చేసిన కచేరి సంగీతప్రియులను ఆద్యంతం అలరించింది. ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమానికి హాజరైన 25 వేల మంది అభ్యాసీలు తన్మయత్వంలో ఓలలాడారు.
సంగీతప్రేమికులు చూపించే అభిమానం, వాత్సల్యం నాకు మరింత ధైర్యం, సంతోషాన్ని ఇస్తుంది. ప్రముఖ దర్శకుడు డా.కె విశ్వనాథ్ రూపొందించిన సిరివెన్నెల చిత్రం కోసం పనిచేసేందుకు వచ్చాను. భూమండలానికే పచ్చటిహారంలా ఉన్న శ్రీరామచంద్రమిషన్ క్యాంపస్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరెక్కడా లేదని చెప్పగలను. నా సంగీత ప్రస్థానం మొదటిలో కల్యాణిరాగంతో ఫ్లూట్ నేర్చుకున్నారు. 50 ఏళ్లయినా ఇప్పటికీ ఆ రాగాన్నే సాధన చేస్తున్నాను.- హరిప్రసాద్ చౌరాసియా, ప్లూటిస్ట్ మాస్ట్రో
ఇవీ చదవండి: ఇవీ చదవండి: LEOPARDS VIDEO VIRAL : అక్కన్నపేటలో చిరుతపులుల సంచారం
వేధింపులు భరించలేక దళిత విద్యార్థిని ఆత్మహత్య.. హాస్టల్లో విగతజీవిగా మరొకరు