ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుజరాత్ ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం సందర్శించింది. వారికి సాదర స్వాగతం పలికిన వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ప్రవీణ్ రావు.. పీజేటీఎస్‌ఏయూ ఆవిర్భావం తర్వాత బోధన, పరిశోధన, విస్తరణల్లో చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఇటీవల విశ్వవిద్యాలయం 11 వ్యవసాయ అంకుర కేంద్రాలతో చేసుకున్న కీలక ఒప్పందాల గురించి తెలిపారు. పీహెచ్‌డీ, పీజీ, యూజీ తరగతులు, ప్రాక్టికల్స్ దశల వారీగా ప్రారంభిస్తున్నామని చెప్పారు.
అనంతరం రాజేంద్రనగర్ వరి పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన గుజరాత్ బృందం.. డ్రోన్ పరిశోధన ప్రయోగాన్ని పరిశీలించారు. వాతారణం, నీటిపారుదల, భూములు, పంటల సరళి, ఉత్పత్తి, ఉత్పాదతకలు, నేలల తీరు, ఆహారపు అలవాట్లు తదితర అంశాలన్నింటిపై సమగ్ర అధ్యయనం చేసి నివేదికలు రూపొందించామని ఉపకులపతి ప్రవీణ్‌రావు గుజరాత్ బృందానికి తెలిపారు. తాము రూపొందించిన తెలంగాణ సోనా వరి రకం, ఇతర వండగాలకు విశేష ఆదరణ లభిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.
రైతులు ఎదుర్కొంటున్న సవాళ్లను సమర్థంగా పరిష్కరించడానికి మరిన్ని ప్రయోగాలు చేస్తామని వీసీ ప్రవీణ్ రావు తెలిపారు. అగ్రి స్టార్టప్‌లతో ఒప్పందం చేసుకున్న దృష్ట్యా... రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు అనేక అంశాలపై లోతైన శిక్షణ కావాలని గుజరాత్ బృందం తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. తమ రాష్ట్రం సందర్శించాలని గుజరాత్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అంజూశర్మ బృందం ఆహ్వానించగా.. జయశంకర్ వర్సిటీ ప్రవీణ్‌రావు సుముఖత వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : సాగు చట్టాలపై రాష్ట్రపతి వద్దకు కాంగ్రెస్