కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ను సైబర్ నేరస్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా అందరూ ఇళ్లల్లో ఉంటారన్న అంచనాతో సైబర్ నేరస్థులు యువకులు, మహిళలు, వ్యాపారులు, విశ్రాంత అధికారులకు.. బ్యాంకు అధికారులు, పేటీఎం ప్రతినిధులు, వాహన విక్రయదారుల వేషాల్లో రోజూ వందల మందికి ఫోన్లు చేస్తున్నారు. ఆసక్తి ప్రదర్శించిన వారితో మాట్లాడి వారి బ్యాంక్ ఖాతాల్లోంచి రూ.వేలు, లక్షలు కొట్టేస్తున్నారు. లాక్‌డౌన్ ప్రారంభమైన రోజు నుంచి (మార్చి 23) మే 15 వరకు సైబర్ నేరస్థులు బాధితుల నుంచి సుమారు 1.75 కోట్ల నగదు బదిలీ చేసుకున్నారని పోలీసులు అంచనా వేశారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు బాధితులు రూ.8 కోట్లు సైబర్ నేరస్థుల బ్యాంక్ ఖాతాల్లో జమచేశారని చెబుతున్నారు.
అధికారులమంటూ నమ్మిస్తున్నారు
బ్యాంకు అధికారులు, ఆర్మీ అధికారులుగా ఫోన్ చేస్తే బాధితులు సైబర్ నేరస్థులను ఏమాత్రం అనుమానించకుండా నమ్మేస్తున్నారు. బ్యాంకు అధికారులే మాట్లాడుతున్నారనుకొని ఓటీపీలు చెప్పడం, ఓఎల్‌ఎక్స్ వెబ్‌సైట్‌లో వాహనాలు కొనే ప్రయత్నంలో మోసపోతున్నారు. లాక్‌డౌన్ మొదలవగా కేసుల సంఖ్య తగ్గుతుందని పోలీస్ అధికారులు భావించగా.. ఇందుకు భిన్నంగా రోజుకు 10 మంది నుంచి 15 మంది ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. ఇప్పటికీ తమతో ఫోన్‌లో మాట్లాడుతున్నారని, వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.
సాంకేతిక ఆధారాలతో సరి..
దిల్లీ, నోయిడా, కోల్‌కతా, ఝార్ఖండ్, బిహార్‌లలో ఉంటున్న సైబర్ నేరస్థులు ప్రణాళికా బద్ధంగా బాధితులను మోసం చేస్తున్నారని పోలీసులు ప్రాథమిక ఆధారాలతో గుర్తించారు. వారిని అరెస్ట్ చేసేందుకు వెళ్లే పరిస్థితులు లేకపోవడం వల్ల సాంకేతిక ఆధారాలను సేకరించి పెట్టుకుంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు గతంలో దిల్లీ, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలకు వెళ్లి నేరస్థులను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో పదుల సంఖ్యలో ముఠాలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నందున నేరస్థులను పట్టుకునేందుకు ఇప్పుడు సాధ్యం కాదని చెబుతున్నారు. నగదు బదిలీ చేసేముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన ఖాతాల్లో సొమ్ము భద్రంగా ఉంటుందని సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు.
ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్ జోన్లు..అవి ఏంటో తెలుసా..!