కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జిల్లెలగూడలో ఆందోళన చేపట్టారు. పెంచిన పెట్రోల్ డీజిల్, గ్యాస్, ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు న్యాయం జరిగిందని పేదలకు సంక్షేమ ఫలాలు అందాయన్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలను పాలించే నైతిక అర్హత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయాయని పేర్కొన్నారు. ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ నాంపల్లిలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని దాని వల్ల అన్నింటి రేట్లు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని అన్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నా.... దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతున్నారని ఆరోపించారు. ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వరకు తోపుడు బండ్లపై మోటార్ సైకిళ్లు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన తెలిపాయి. ధరలు తగ్గించకపోతే నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేస్తామన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
ఇదీ చదవండి: గ్యాస్, చమురు ధరల పెంపును ఖండిస్తూ కాంగ్రెస్ వినూత్న నిరసనలు