Koheda Fruit Market: కొహెడ పండ్ల మార్కెట్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు. 178 ఎకరాల్లో ఏర్పాటు కానున్న కొహెడ మార్కెట్.. దిల్లీ మార్కెట్ కంటే పెద్దదిగా ఉండబోతోందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్‌ను మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. మామిడి పండ్ల సీజన్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
వంద ఫీట్ల రోడ్డుకు శంకుస్థాపన
తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని కొహెడ-ఉమర్‌ఖాన్‌గూడ నుంచి పండ్ల మార్కెట్ వరకు 50లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద ఫీట్ల రోడ్డుకు మంత్రులు శంకుస్థాపన చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్‌కు సమీపంలో ఉండడం కొహెడ మార్కెట్‌కు మంచి గుర్తింపు తెస్తుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పటి వరకు క్రయ విక్రయాలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే బాటసింగారంలో తాత్కాలికంగా పండ్ల మార్కెట్ ఏర్పాటు చేశామని వివరించారు.
గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కోల్డ్ స్టోరేజ్..
ప్రణాళికాబద్ధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్‌ను రూపుదిద్దేందుకు లే-అవుట్ సిద్ధమవుతోందని మంత్రులు వివరించారు. తెలంగాణ గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో కొహెడలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో 50 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు లక్ష్యంతో.. ఆలుగడ్డ విత్తనం స్టోరేజీ లక్ష్యంగా కొహెడ కోల్డ్ స్టోరేజీ ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: