రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి వంతెన కింద లభ్యమైన మహిళ శవం ఎవరిదనేది ఇంకా తేలలేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ.. ఘటన మరవకముందే అదే తరహాలో మరో హత్య చోటుచేసుకుంది. దర్యాప్తునకు నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. చుట్టుపక్కల ప్రాంతాలను జల్లెడ పట్టారు. అదృశ్య కేసులు ఏవైనా నమోదయ్యాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా రిసార్టులు, వ్యవసాయ క్షేత్రాలు ఉండటం వల్ల ఆ కోణంలో ఆరా తీస్తున్నారు.
మృతదేహాలకు అడ్డాగా చేవెళ్ల...
అతి సమీపంలోని చేవెళ్ల ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహాలు లభ్యం కావడం సర్వసాధారణమై పోయింది. గత సంవత్సరం జనవరి 30న ముళ్ల కంచెలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. ఇప్పటివరకూ ఆమె ఎవరన్నది తెలియలేదు. గతేడాది ఏప్రిల్ 16న జరిగిన ఓ హత్య మిస్టరీగానే మిగిలిపోయింది. గత సంవత్సరం మార్చి 31న ఊర్ల గ్రామ శివారులో మద్యం మత్తులో ఓ వ్యక్తి తలపై మోది హత్య చేశారు. ఇప్పటివరకూ ఆ వ్యక్తి ఎవరన్నది కనుక్కోలేదు. టెక్నాలజీ పెరిగినా.. హత్యకు సంబంధించిన వివరాలూ తెలియలేదు.
ఆ మహిళ ఎవరు?
బ్రిడ్జి వద్ద లభ్యమైన మహిళ హత్యపై ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో అనుమానాలు కలుగుతున్నాయి. సామాజిక మాధ్యమాలు, మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసినా.. మృతురాలి ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. మహిళ చేతికి ఉన్న బంగారు గాజులు, ఉంగరం, మెడలో లాకెట్ ఉండడం వల్ల ఉన్నత కుటుంబానికి చెందిన మహిళై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు వివరించిన వివరాల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల మధ్యలో హత్య జరిగి ఉంటుందని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ఇక్కడకు తీసుకువచ్చి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.