వైద్యుల నిర్లక్ష్యం... ఆసుపత్రిలో డాక్టర్లని అందుబాటులో ఉంచని అధికారుల వైఖరి.. ఏదైతేనేం... ఓ పిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవడానికి కారణమయ్యాయి. రంగారెడ్డి జిల్లా కొలుకులపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల శివ సైకిల్ మీద నుంచి కిందపడి తీవ్ర గాయలపాలయ్యాడు. కుటుంబసభ్యులు వెంటనే నాంపల్లిలోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.
రక్తం తెచ్చిపెట్టుకున్నారు
రాత్రి 12 గంటలకు బాలుడిని పరిక్షించిన వైద్యులు ఆపరేషన్ చెయ్యాలని చెప్పారు. చికిత్స కోసం రక్తం అవసరమంటే బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తం కూడా తీసుకొచ్చారు బంధువులు. అంతా సిద్ధమనుకున్న సమయంలో కింద వార్డులో గర్భిణీకి డెలివరీ చెయ్యాలని డాక్టర్ వెళ్లిపోయారు. అందుబాటులో వేరే వైద్యుడు కూడా లేక... పరిస్థితి విషమించి ఈరోజు ఉదయం ఏడున్నరకు ఆ బాలుడు మృతి చెందాడు.
బంధువుల ఆందోళన
వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శివ ప్రాణాలు తీసేశారంటూ బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. బాధ్యుడైన వైద్యునిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల భద్రత మధ్య ఆసుపత్రి సిబ్బంది మృత దేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.
ఇవీ చూడండి: పోలీసులకు చిక్కిన రూ.8 కోట్లు కమలానివే...!