రజాకార్ల నిరంకుశ పాలనకు అద్దం పట్టేలా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని భాజపా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సమైక్యతా దినోత్సవంగా ప్రభుత్వం నిర్వహించడాన్ని నిరసిస్తూ భాజపా శ్రేణులు.. నల్ల రిబ్బన్లతో ఎల్బీనగర్లో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సామ రంగారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా 80 వేల పుస్తకాలు చదివిన సీఎం కేసీఆర్కు.. సాయుధ పోరాట అమరుల చరిత్ర తెలియదా అని సామ రంగారెడ్డి ప్రశ్నించారు. ఎంఐఎం ఓట్ల కోసం నిజాంను సీఎం పొగుడుతున్నారని ఆరోపించారు. నిజాంను పొగడటం అంటే తెలంగాణ విమోచన పోరాట వీరులను అవమాన పరచడమే అని అన్నారు. తెలంగాణ విమోచనాన్ని సమైక్యతా దినోత్సవంగా జరపడం ఉద్యమ వీరులను అవమానించడమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కళ్లెం రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి:'తెలంగాణపై కేంద్రం గజనీ మహమ్మద్లా దండయాత్ర చేస్తోంది'
ఎస్టీ రిజర్వేషన్లు ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదు: బండి సంజయ్