Bandi Sanjay on BJP Victory in North Eastern States: ఈశాన్య రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయదుందుభి మోగించడంపై తెలంగాణ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచిపెడుతూ, బాణాసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. తెలంగాణలోను రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయ ఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈశాన్య రాష్ట్రాల్లో కమలం జెండా పట్టుకొని తిరగలేని స్థాయి నుంచి నేడు పార్టీ జెండాను ఎగరేసే స్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్న ఆయన.. తెలంగాణలోను డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడింది : తెలంగాణ వచ్చాక కేసీఆర్ కుటుంబం మినహా ఎవరి బతుకులు బాగుపడలేదని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లాలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బండి.. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయన్న సంజయ్.. ప్రీతి హత్యపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. పంజాబ్ సీఎం కేవలం ధావత్ కోసమే వచ్చారన్న బండి.. 8 ఏళ్లుగా ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటికే రావట్లేదని ఎద్దేవా చేశారు. కేంద్రం ఇస్తోన్న నిధులకు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వట్లేదన్న సంజయ్.. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణలోను డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు తథ్యం: అసంబద్ధ పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఈ ఫలితాలు చెంపపెట్టు అని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. నిరంతరం మోదీని దూషించే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓటమికి సిద్ధంగా ఉండాలని.. తెలంగాణలోను డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటు తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జాతీయరహదారి పనులపై సమీక్ష : జాతీయ రహదారుల విస్తరణ పనులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎల్కతుర్తి- సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులు సహా ఇతర రహదారుల పనుల పురోగతిపై కేంద్ర రోడ్లు, రవాణా శాఖ అధికారులతో హైదరాబాద్‌లో సమావేశమై సమీక్ష చేశారు. ప్రధానమంత్రి నరంద్రమోదీ చేతుల మీదుగా గతేడాది నవంబర్ 12న సిద్దిపేట –ఎల్కతుర్తి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన జరగగా నాటి నుంచి చేపట్టిన పనుల పురోగతితో పాటు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ ఏ పనులు చేపట్టాలనే అంశంపై సమీక్షించారు. 578 కోట్ల రూపాయలతో చేపట్టిన 63 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నట్లు అధికారులు బండి సంజయ్‌కి వివరించారు. పనుల్లో భాగంగా బస్వాపూర్, పందిళ్ల వద్ద నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జి నిర్మాణంతోపాటు 26 మైనర్ వంతెనల పునర్నిర్మాణం వివరాలను బండి సంజయ్ అడిగి తెలుసుకున్నారు. ముల్కనూరు డెయిరీ సంస్థకు ఇబ్బంది లేకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇవీ చదవండి: