రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన ఓ మహిళ షుగర్ పేషెంట్ కావడం వల్ల ఈ నెల 19న హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. కరోనా పరీక్షలు చేసుకున్నాకే షుగర్ వ్యాధికి చికిత్స అందిస్తామని వైద్యులు చెప్పగా నమూనాలు ఇచ్చారు. 20న మధ్యాహ్నం ఆ మహిళకు కరోనా పాజిటివ్‌గా అపోలో వైద్యులు నిర్దారించగా ఆమె ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆమె ఆరోగ్యం బాగానే ఉన్నందున... అపోలో ఆసుపత్రి రిపోర్ట్ మీద నమ్మకం లేక అదేరోజు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షకు నమూనాలు ఇచ్చారు. 21న మధ్యాహ్నం ఇచ్చిన రిపోర్టులో ఏఐజీ వైద్యులు ఆమెకు కరోనా నెగిటివ్‌గా నిర్దారించారు.
అంతకుముందు...
ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి ముందు... లక్ష్య సాధన ఫౌండేషన్ వారు పెద్దమంగళారం గ్రామంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొవిడ్ వ్యాధి నిరోధక మందులను వారి చేతుల మీదుగా పంపణీ చేశారు. ఈ నేపథ్యంలో ఆపోలో ఆస్పత్రి తప్పుడు రిపోర్టు కారణంగా గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. వీళ్లకు కరోనా ఉందని ఆ ప్రాంతాన్ని పోలీసులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అప్పటినుంచి తన కుటుంబాన్ని విచిత్రంగా చూస్తున్నారని, మానసిక వేదనకు గురయ్యామని బాధితురాలు తెలిపారు. ఇలాంటి తప్పుడు రిపోర్ట్స్‌తో ఇబ్బందులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు ప్రభుత్వాన్నికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: ఆర్‌బీఐ పరిధిలోకి సహకార బ్యాంకులు