A young man committed suicide in Gurramguda: ఆ యువకుడు బాగా విద్యావంతుడు. పై చదువుల కోసం విదేశాలకు సైతం వెళ్లాడు. అతడు ఒక యువతిని ప్రేమించి.. పెద్దవారికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇరు కుటుంబాల్లో ఆ విషయం తెలిసింది. యువతి తరఫు తల్లిదండ్రులు కులం పేరుతో యువకుడిని దూషించడంతో మనస్తాపం చెందిన ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ వనస్థలిపురం ఠాణా పరిధిలో జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేలోతు తండాకు చెందిన కేలోతు జగ్రునాయక్, విజయలక్ష్మి దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలస వచ్చారు. గుర్రంగూడ సమీపంలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడైన గోపీనాయక్(26)కు గుర్రంగూడలోని రాజిరెడ్డి కాలనీలో నివాసముంటున్న యువతి(21)తో 2018లో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది.
ఇదిలా ఉండగా.. యువకుడు ఉన్నత చదువుల కోసం 2019లో లండన్ వెళ్లాడు. అక్కడ ఉన్న ఆయనతో యువతి నిత్యం ఫోన్‌లో సంభాషించేది. ఏడాది క్రితం చదువు మధ్యలోనే ఆపేసి లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు గోపీనాయక్. అనంతరం నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా చేరాడు. ఆరు నెలల క్రితం వాళ్లిద్దరూ.. ఇళ్లల్లో చెప్పకుండా ఓ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.
అనంతరం ఎవరి ఇంట్లో వారు ఉంటున్నారు. నాలుగు నెలల క్రితం యువతి యువకుడి ఇంటికెళ్లింది. తమ ఇంటికి ఎందుకొచ్చావని యువకుడి కుటుంబసభ్యులు నిలదీయడంతో.. తామిద్దరం ప్రేమించుకున్నామని.. పెళ్లి చేసుకున్నామని.. పుస్తెల తాడు చూపించింది. దీంతో యువతికి, యువకుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు యువతికి నచ్చజెప్పి తిరిగి ఆమెను ఇంటికి పంపించేశారు.
ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి యువకుడికి, యువతి తల్లిదండ్రులకు మధ్య గొడవలు ఏర్పడ్డాయి. గోపీనాయక్‌ను కులం పేరుతో దూషించడం మొదలుపెట్టారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు.. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదివారం మృతుడి కుటుంబీకులు న్యాయం చేయాలంటూ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: