A young man commits suicide in RangaReddy : తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో నేటి తరం యువత చిన్నదో పెద్దదో ఉద్యోగం చేస్తూనే ఉంది. అయితే కొందరు తమ మెరిట్‌తో మంచి ఉద్యోగాలు సంపాదించి అందులో సెటిల్ అయ్యే సమయానికి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. అలా ఉద్యోగాల్లో ఒత్తిడిని ఎదుర్కోలేక.. అలాగని ఉద్యోగం వదులుకోలేక సతమతమవుతున్నారు. చివరకు డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓవైపు క్లైంట్స్ నుంచి ఒత్తిడి.. మరోవైపు మేనేజర్ నుంచి ప్రెజర్.. ఇలా రెండు వైపుల నుంచి స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తీవ్రంగా డిప్రెషన్లోకి వెళ్లిపోతున్నారు. కొన్నిసార్లు ఇదంతా ఎందుకని.. చావే శరణ్యమని భావించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఓ యువకుడు హెచ్‌ఆర్ మేనేజర్ వేధింపులు భరించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణం చేసుకునే ముందు తల్లిదండ్రులకు లేఖ రాశాడు. దాంతో పాటు తన కుటుంబం అంటే తనకు ఎంత ప్రేమో అందులో వవ్యక్త పరిచాడు.
కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో వాటర్‌మెన్‌గా పని చేస్తున్న పాశం గోపాల్, అనసూయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందులో చిన్న కుమారుడైన సురేశ్(29) దగ్గరల్లో ఉన్న వావిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యనే హెచ్‌ఆర్ మేనేజర్ రవికుమార్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పరిశ్రమ నిబంధనల ప్రకారం నోటీస్ పీరియడ్‌లో భాగంగా ఈ నెల 5వ తేది వరకు పని చేశాడు. 6వ తేదీ శనివారం కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. అయితే 6వ తేదీ ఆదివారం రోజున ఇంట్లో వాళ్లు బంధువులు, శుభకార్యం ఉండడంతో బయటకు వెళ్లారు. సురేశ్ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు. ఒంటరిగా ఉన్న సురేశ్ ఇంట్లో ఉన్న చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బంధువుల ఇంట్లో శుభకార్యం ముగించుకుని ఇంటికి వచ్చిన కుటుంబీకులు.. సురేశ్ ఉరికి వేలాడుతుండటం చూసి షాకయ్యారు. వెంటనే కిందకు దించి బతికించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సురేశ్ మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తల్లి అనసూయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో విచారణ చేస్తున్నామని స్థానిక ఎస్ఐ శంకర్ తెలిపారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం షాద్‌నగర్ కమ్యూనిటీ వైద్యాశాలకు తరలించారు. సురేశ్ ఆత్మహత్య చేసుకునే ముందు లేఖ రాశాడు. ఆ ఉత్తరంలో "అమ్మా.. నాన్నా.. క్షమించండి.. మీతో కలిసి జీవించాలి అనుకున్నాను. కానీ, తప్పడం లేదు. కొంత కాలంగా మానసిక క్షోభ అనుభవిస్తున్నా. మా కంపెనీ హెచ్‌ఆర్ మేనేజర్ వేధింపులు తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంటున్నానంటూ" అని రాశాడు.
ఇవీ చదవండి: