రాజేంద్రనగర్‌లో గత కొన్ని నెలలుగా కలకలం సృష్టిస్తున్న చిరుత... ఎట్టకేలకు చిక్కింది. వాలంతరీ ప్రాంతంలో రెండు రోజుల క్రితం రెండు లేగదూడలను చిరుత చంపటంతో అప్రమత్తమైన అధికారులు బోను ఏర్పాటు చేశారు. వాలంతరీ వద్ద ఉదయం 4 గంటలకు చిరుత బోనులో చిక్కింది.
బోనులోంచి బయటపడేందుకు చిరుత తీవ్ర ప్రయత్నం చేయటంతో దానికి గాయాలైనట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చిరుతను వైద్యం కోసం జూపార్కుకి తరలించారు. చికిత్స అనంతరం తిరిగి అడవిలో వదిలేయనున్నట్లు స్పష్టం చేశారు. మార్చిలో మొట్టమొదటి సారిగా రాజేంద్రనగర్ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎన్ఐఆర్డీ సమీపంలో చిరుత అడవి పందిని చంపింది. అనంతరం గగన్ పహాడ్ రోడ్డు మీద సంచరిస్తున్న చిరుత సీసీటీవీ వీడియోలు అప్పట్లో హల్చల్ చేశాయి. తిరిగి జూన్‌లో నారంకు వచ్చిన చిరుత... తిరిగి మరో అడవిపందిపై దాడి చేసింది. జీవికే గార్డెన్ దగ్గర స్విమ్మింగ్ పూల్‌కి వచ్చి నీళ్లు కూడా తాగింది.
అప్పట్లో చిరుతను పట్టుకునేందుకు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దాని కదలికలను గుర్తించేందుకు పలుచోట్ల అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా పెద్దగా ఉపయోగం కలగలేదు. గత నెలలోనూ వాలంతరీ ప్రాంతంలో ఓ లేగదూడపై దాడి చేసిన పులి... చనిపోయిన దూడను రెండో రోజు రాత్రి వచ్చి దాదాపు కిలోమీటరు దూరానికి తీసుకువెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా... మొన్న అర్ధరాత్రి రెండు దూడలపై దాడి చేసిన నేపథ్యంలో చనిపోయిన దూడలను బోనులో ఉంచి... ఏర్పాటు చేసిన ట్రాప్‌లో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ అధికారులు ప్రకటించారు.
ఇదీ చదవండి: పంటను కాపాడుకునేందుకు ప్రత్యేక యంత్రం