Tension in cess counting: రాజన్న సిరిసిల్ల జిల్లా సెస్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరిత వాతావరణంలో కొనసాగుతోంది. జిల్లాలో 15 డైరెక్టర్ల స్థానాలకు గాను రుద్రంగి, వీర్నపల్లి రెండు స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మిగతా 13 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. మరోవైపు గంభీరావుపేట లెక్కింపు కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వేములవాడ సెస్ ఎన్నికల్లో గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ బ్యాలెట్ బాక్సులు సీల్ లేకుండా ఉన్నాయని స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై ఇండిపెండెంట్ అభ్యర్థి, బీజేపీ ఏజెంట్లు ధర్నాకు పూనుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చేస్తున్న అభ్యర్థులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు వేములవాడ రూరల్ సెస్ డైరెక్టర్ ఓట్ల లెక్కింపులోనూ గందరగోళం చోటు చేసుకుంది. వేములవాడ రూరల్ స్థానంలో బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినా అధికారికంగా ప్రకటించలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆకుల దేవరాజ్ గెలుపొందినట్లు ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలకు పని కల్పించారు. ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద భారీగా గుమిగూడిన ప్రజలను లాఠీలతో చెదరగొట్టారు.
మరోవైపు నాయకులు ఎన్నికల అధికారుల ముందు ఫలితం ఎందుకు ప్రకటించడం లేదని నిలదీశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికల అధికారి వేములవాడ రూరల్ స్థానానికి బీజేపీ అభ్యర్థి జక్కుల తిరుపతి గెలుపొందినట్టు ప్రకటించారు. దీంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. మరోవైపు రీకౌంటింగ్ నిర్వహించాలని బలపరిచిన అభ్యర్థి దరఖాస్తు చేసుకోవడంతో, ఎన్నికల అధికారి రీకౌంటింగ్‌కు అనుమతించడం చర్చనీయాంశంగా మారింది.
ఇవీ చదవండి :