దసరా సందడి అప్పుడే మొదలైంది. బతుకమ్మ చీరల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ నాటికి చీరల పంపిణీకి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో బతుకమ్మ చీరల కోసం రూ.320 కోట్లు విలువ చేసే 6.84 కోట్ల మీటర్ల వస్త్రాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది సర్కార్. ఈ మేరకు సిరిసిల్లలోని వివిధ యాజమాన్యాల పరిధిలో ఉన్న మరమగ్గాలకు చీరల నేత అప్పగించారు. ఇప్పటి వరకు 4.67 కోట్ల మీటర్ల వస్త్రాలు ఉత్పత్తి కాగా... కోటి చీరలకు గానూ 81 లక్షల చీరల తయారీ పూర్తైంది. జిల్లాల వారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇప్పటివరకు 35 లక్షల చీరలు సరఫరా చేయగా, ఈ నెలాఖరులోగా 50 లక్షల చీరలు జిల్లాలకు చేరవేయనున్నారు.
సిరిశాలతో గుర్తింపు
ఈ ఏడాది బతుకమ్మ చీరల తయారీలో అనేక ప్రత్యేకతలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బంగారు రంగు జరీ అంచుతో...వృద్ధుల కోసం 6గజాలు, మిగతా వారికి ఫ్యాన్సీ చీరలు తయారు చేస్తున్నారు. 100 రంగుల్లో ఉన్న చీరలకు జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ-నిఫ్ట్ నిపుణులు డిజైనింగ్ చేశారు. ఏటా లక్షల సంఖ్యలో చీరల తయారీ జరుగుతున్నందున గద్వాల, పోచంపల్లి చీరల తరహాలో సిరిసిల్ల చీరలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలనే యోచనలో ఉంది ప్రభుత్వం. బతుకమ్మ చీరలపై సిరిశాల పేరిట ప్రత్యేక లోగో తయారు చేయాలని చేనేత శాఖ నిర్ణయించింది.
ఆదాయం పెరిగింది
సిరిసిల్లలో వివిధ యాజమాన్యాల పరిధిలో 23 వేలకు పైగా మరమగ్గాలు ఉండగా, వీటిలో 17 వేలకు పైగా మగ్గాలపై బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. రోజుకు తొమ్మిది లక్షల మీటర్ల బతుకమ్మ చీరల వస్త్రాలు ఉత్పత్తి జరుగుతోంది. బతుకమ్మతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకలు, కేసీఆర్ కిట్లు, యూనిఫామ్‌లకు సంబంధించిన వస్త్రాల ఉత్పత్తి ఇక్కడే జరుగుతోంది. వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మూడేళ్లలో రూ.900 కోట్ల మేర ఆర్డర్లు అందాయి. 9,435 మంది కార్మికులు బతుకమ్మ చీరల తయారీతో ఉపాధి పొందుతున్నారు. గతంలో వీరి నెలవారీ ఆదాయం రూ.8 వేల లోపే ఉండేది. ప్రస్తుతం సగటున ఒక్కో కార్మికుడు రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం లభిస్తున్నట్లు చేనేత శాఖ అంచనా వేస్తోంది.
మంత్రి కేటీఆర్ చోరవ
వృత్తి భద్రత కరవైన పరిస్థితుల్లో మరమగ్గాల కార్మికుల బలన్మరణాలు కొనసాగాయి. నిత్యం గిట్టుబాటు కూలీ కోసం ఆందోళనబాట పట్టాల్సి వచ్చింది. అర్ధాకలితో జీవనం సాగిస్తున్న మరమగ్గ కార్మికుల జీవన స్థితిగతుల్లో సమూల మార్పు కోసం మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. మూడేళ్లలో దశలవారీగా పరిశ్రమను అభివృద్ధిపథంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నారు. ఉపాధిమార్గాలు సుగమం చేస్తూనే మరమగ్గాలు నవీకరించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రం ప్రభుత్వమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఆర్డర్లు వచ్చేలా పరిస్థితుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బతుకమ్మ చీరలను హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సీడీఎంఏ భవనంలో ప్రదర్శనకు ఉంచారు. మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శన ప్రారంభిచారు.
గతంలో పని లేక 3 పూటలా తినేందుకు తిండి లేక సతమతమయ్యారు చేనేత కార్మికులు. ఇప్పుడు బతుకమ్మ చీరల రూపంలో ఉపాధినందిస్తుండటం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
ఇదీ చూడండి: 23నుంచి బతుకమ్మ చీరల పంపిణీ