మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో నూతన శోభ సంతరించుకోనుంది. పట్టణ శివారులోని కొత్తచెరువు.. పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. 2015లో రూ. 7.50 కోట్లతో కొత్త చెరువు అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రెండు కిలోమీటర్ల పొడవున్న చెరువు కట్టను 7 మీటర్లు వెడల్పు చేసి రహదారిని నిర్మించారు.
మొత్తం 74 ఎకరాల కొత్త చెరువు విస్తీర్ణంలో ఇప్పటికే నాలుగు ఎకరాల్లో పార్కును ఏర్పాటు చేశారు. 3.5 ఎకరాల్లో ఐలాండ్ సైతం నిర్మాణంలో ఉంది. ఉదయం పూట వ్యాయామం చేసేందుకు వాకింగ్ ట్రాక్‌తో పాటు ధ్యాన మందిరాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన చిల్డ్రన్ పార్క్, అడ్వెంచర్ పార్క్, రాక్ గార్డెన్ పూర్తయ్యాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా దిల్లీ నుంచి ట్రాయ్ రైలు బండిని తెప్పించారు. కొత్తచెరువులో పడవ సౌకర్యంతో పాటు, టూరిస్ట్ స్పాట్ కోసం కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా లక్నవరం చెరువుపై ఉన్న సస్పెన్షన్ బ్రిడ్జి మాదిరిగా ఇక్కడ కూడా వంతెన నిర్మించేందుకు నిర్ణయించారు. 2.75 కోట్లతో బ్రిడ్జిని ఏర్పాటు చేయనున్నారు.
ఇవీ చూడండి: 'ఖనిజ పరిశ్రమల ప్రగతికి ప్రణాళికలు రూపొందించండి