సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సీఎస్ఆర్ నిధులతో నిర్మిస్తున్న బాలికల ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ కృష్ణ భాస్కర్ సందర్శించారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, గ్రౌండ్, తదితర వాటిని పరిశీలించారు. కార్పొరేట్ హంగులకు ఏ మాత్రం తగ్గకుండా పాఠశాలను నిర్మించడం హర్షణీయమన్నారు.
ప్రతీ విద్యార్థికి మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీలు స్వయంగా ముందుకు వచ్చి సుమారు రూ. 3 కోట్ల సీఎస్ఆర్ నిధులతో పాఠశాల భవనాన్ని నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు విద్యనభ్యసించేలా... 20 తరగతి గదులు ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వారంలో నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, త్వరలోనే ప్రారంభానికి సిద్ధం చేసేలా చూస్తామని తెలిపారు.
లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, 32 కంప్యూటర్ లతో కూడిన కంప్యూటర్ ల్యాబ్, ఇంటర్నెట్ సదుపాయం, 400 మంది విద్యార్థులు కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్, 12 సీసీ కెమెరాలు, 350 డెస్క్ లు, ఫుట్ బాల్ కోర్టు, వాలీ బాల్ కోర్టు, తదితర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్కు సంబంధిత అధికారులు వివరించారు.
ఈ ఫిబ్రవరి నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ప్రధాన ఉపాధ్యాయుడు కలెక్టర్ సూచించారు.ఈ సందర్శనలో గివ్ తెలంగాణ మేనేజింగ్ డైరెక్టర్ సంకేత్, హెడ్ మాస్టర్ భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఊర్లో ప్రియురాలు, దుబాయ్లో ప్రియుడు ఆత్మహత్య