Sircilla Handloom Indian Flags : స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు (Azadi Ka Amrit Mahotsav) అవుతున్న సందర్భంగా దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా. మహానీయుల త్యాగాలు.. పోరాట ఫలాలు నేటి తరానికి తెలిసేలా ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండాలు ఎగుర వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఇంటింటికీ జాతీయ జెండాలను (Har Ghar Tiranga) అందించేందుకు సిరిసిల్లలో జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల జాతీయ జెండాలు అవసరం ఉండగా.. 55లక్షల మీటర్ల పాలిస్టర్ వస్త్రాన్ని టెస్కో ద్వారా కొనుగోలు చేసి జెండాల తయారీకి అప్పగించారు. ఆ బట్టను ప్రాసెసింగ్ చేసి, మూడు రంగుల జెండాలను తయారు చేయాలని సూచించారు.
"స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మాకు దేశ వ్యాప్తంగా ఆర్టర్లు వచ్చాయి. గత 15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నాము. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆర్డర్లు పూర్తి చేశాము. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆర్డర్ వచ్చింది. ఇక్కడ దాదాపు 5 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా సిరిసిల్లా చేనేతలకు పేరు రావడం ఆనందంగా ఉంది." - మురళి, ఆసామి, రాజన్నసిరిసిల్ల జిల్లా
Sircilla Weavers Indian Flags : సిరిసిల్ల నేతన్నల వద్దనే 55 లక్షల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేశారు. ఈ వస్త్రానికి ఒక్కో మీటరుకు రూ.12 చెల్లిస్తున్నారు. అంటే రూ.6.60 కోట్ల ఆర్డర్లు సిరిసిల్ల నేతన్నలకు లభించాయి. స్వాతంత్య్ర సంబురాలు సిరిసిల్ల నేతన్నలకు (77th Independence Day Telangana)కలిసి వచ్చాయి. ఈ జెండాల తయారీలో తలమునకలైన మహిళలు తమకు ఇలాంటి పనులు ఏడాదంతా ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు. తాము బీడీలు తయారు చేస్తే కూలి తక్కువగా అందుతుందని అంతేకాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాంటి పనులు కల్పిస్తే వేన్నీళ్లకు చన్నీల్లు తోడన్నట్లు మేము కూడా కష్టపడటానికి సిద్దంగా ఉన్నామని చెబుతున్నారు.
జెండాకు సెల్యూట్ చేస్తూ మాజీ జవాన్ మృతి
"మేము ఇది వరకు బీడీలు చేసేవాళ్లం. రోజుకు రూ.200 వందలు వచ్చేవి. ఇప్పుడు జెండాలు తయారు చేస్తే రోజు రూ. 300 నుంచి రూ.500 వరకు వస్తున్నాయి. ఈ జెండాల పని అయిపోతే ఇక మళ్లీ మాకేం పని ఉండదు. మళ్లీ బీడీలు చేసుకోవడమే ఇగ. ఆ బీడీలతో వచ్చే సంపాదనలో మాకు కనీస అవసరాలు తీరడం లేదు. పిల్లల ఫీజులు ఇలాంటివి కూడా కట్టుకోలేకపోతున్నాం. చేనేత రంగంలోనే మాకు ప్రభుత్వం.. శాశ్వతంగా మాకు ఏదైనా పని కల్పిస్తే బాగుంటుంది." - తయారీదారులు
Har Ghar Tiranga Telangana 2023 : రాష్ట్ర వ్యాప్తంగా 38,588 పవర్స్ ఉండగా. ఇందులో ఒక్క సిరిసిల్లలోనే 28,494 పవర్ లూమ్స్ ఉన్నాయి. రెండో స్థానంలో 4,116 సాంచాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. అతి తక్కువ సాంచాలు 18తో సంగారెడ్డి జిల్లా చివరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, వరంగల్, భువనగిరి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలు చేశారు. ఒక్క సిరిసిల్లలోనే 55 లక్షల మీటర్లు కొనుగోలు చేశారు. ఇప్పటికే సిరిసిల్లలో బతుకమ్మ చీరలు ఉత్పత్తి అవుతుండగా.. మరోవైపు పాలిస్టర్ వస్త్రాన్ని కొనుగోలుకు ఆర్డర్లు రావడం పట్ల ఉత్పత్తిదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. 75లక్షల జాగతీయ జండాల తయారీకి ఆర్డర్లు రాగా ఇప్పటికే 12లక్షల జండాలను వివిధ జిల్లాలకు సరఫరా చేసినట్లు అధికారులు చెప్పారు.
"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ ప్రతి ఇంటిపై జాతీయ జెండా కార్యకర్యక్రమం చేపట్టింది. సిరిసిల్లలోని 48 యూనిట్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. 75 లక్షల జెండాలను తయారు చేయడానకి ఆర్డర్ వచ్చింది. 12 లక్షల జెండాలను పూర్తి చేసి వివిధ జిల్లాలకు పంపించాం." - ఎం.సాగర్, సహాయ సంచాలకులు
గత నెల రోజులుగా రోజు పని దొరకడం వల్ల సంతోషంగా ఉందని చెబుతున్న మహిళలు ఈ నెల గడిచిపోతే మరేదైనా పని ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటే బాగుంటుందని కోరుతున్నారు. ప్రస్తుతం ఖాళీ సమయంలో బీడీలు చేస్తన్నామని దాని వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందని ఆవేదన వ్యక్తం చేశారు.