Shivaratri Celebrations in Telangana : రాష్ట్రంలోని శైవాలయాలు మహాశివరాత్రి వేడుకలతో పండగ వాతావరణం సంతరించుకున్నాయి. శివనామస్మరణతో క్షేత్రాలు మార్మోగుతున్నాయి. ఇవాళ శివరాత్రి కావడంతో ఆలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. భక్తులు వేకువజామునుంచే ఆ మహాదేవుని సన్నిధికి పోటెత్తారు. శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ శైవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.
రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
Shivaratri special Pooja 2022 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఉదయం 3 గంటలకు వరకు సర్వదర్శం.. ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. ఉదయం 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం కల్పించారు. తితిదే తరఫున అధికారుల బృందం వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్... స్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రమేష్ బాబు, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు. ఇక సాయంత్రం 4 గంటలకు శివదీక్ష స్వాములకు దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6.05 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన.. రాత్రి 11.35 గంటలకు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.
కీసరలో ఘనంగా ఉత్సవాలు
Shivaratri Celebrations in Telangana 2022 : మేడ్చల్ జిల్లా కీసరలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారికి వైభవంగా రుద్రాభిషేకం చేశారు. మహా శివరాత్రి పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు, కేటీఆర్ సతీమణి శైలిమ... కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆలయానికి చేరుకున్న శైలిమా, హిమాన్షులకు అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రామలింగేశ్వర స్వామి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఆ పరమేశ్వరుని సన్నిధిలో రుద్రహోమం, గణపతి హోమం నిర్వహిస్తున్నారు.
మల్లన్న పెద్దపట్నం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో ఇవాళ పెద్దపట్నం కార్యక్రమం ఉంటుంది. రేపు లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక రుద్రభిషేకం జరుపుతారు. కొమురవెల్లి పురవీధుల్లో మల్లన్న ఊరేగింపు సేవ.. తెల్లవారుజామున పెద్దపట్నం దాటే కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కాళేశ్వరంలో భక్తుల రద్దీ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి.. దీప దానాలు, సైకత లింగాలకు పూజలు చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. వరంగల్, హైదరాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు కాళేశ్వర, శుభనందాదేవిల కల్యాణం జరుగుతుంది. రాత్రి 12 గంటలకు మహాభిషేకం లింగోద్భవం, ప్రత్యేక పూజలు ,చండీ వాహనం కాలరాత్రి పూజలు నిర్వహిస్తారు.
జోగులాంబ ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు
దక్షిణకాశీగా తుంగభద్ర తీరంలో వెలసిన బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే అభిషేకాలు ప్రారంభమయ్యాయి. శివునికి ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆలయం శివ నామస్మరణతో మార్మోగుతోంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలతో పాటు నవబ్రహ్మ ఆలయాలు, పాపనాశేశ్వర, సంగమేశ్వర ఆలయాలు శివరాత్రి శోభ సంతరించుకున్నాయి. ఆలయాలను సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించారు.
సంగమేశ్వరస్వామికి శివరాత్రి పూజలు
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకి సంగమేశ్వర ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన కేతకి ఆలయ దర్శనానికి భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. గర్భగుడిలోని లింగానికి అభిషేకం చేస్తూ.. పార్వతీ సమేత సంగమేశ్వరుని దర్శించుకుంటున్నారు. శివ మాల ధరించిన భక్తులు ఇరుముడితో ఆలయానికి తరలి వస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా రావడంతో.. ఆలయంలో క్యూలైన్లు కిక్కిరిశాయి. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామి దర్శనంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
నల్గొండలో శివరాత్రి వేడుకలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెర్వుగట్టు, పానగల్ ఛాయాసోమేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పిల్లలమర్రి, వాడపల్లి శివాలయాలకు వేకువజామునుంచే భక్తులు పోటెత్తారు.
ఖమ్మంలో శివరాత్రి శోభ
మహాశివరాత్రి సందర్భంగా ఖమ్మం నగరంలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారు జామునుంచి భక్తులు పోటెత్తారు. ప్రత్యేక పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. నగరంలోని గుంటుమల్లేశ్వరాలయం, సుగ్గులవారి తోట శివాలయం, ద్వంసలాపురం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మున్నేరు నది పున్యస్నానాలు ఆచరిస్తున్నారు.
ఉమామహేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సూరారం శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు తరలివస్తున్నారు. మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం 4 గంటలకే అభిషేకం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు అన్ని సదుపాయాలు కల్పించారు.
శివరాత్రి ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ జిల్లాలో శైవాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులు వేకువ జామునుంచే ఆలయాలకు తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని రవీంద్ర నగర్లోని ఉమామహేశ్వర ఆలయం, కుమార్ పేట్ గంగపుత్ర శివాలయం, వాల్మీకి నగర్లోని శ్రీ రాజరాజేశ్వర ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివుడికి బిల్వ పత్రి సమర్పించి లింగానికి పాలాభిషేకం చేస్తున్నారు. భక్తుల కోసం ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: Shivaratri Celebrations in Telangana : శివాలయాలకు మహాశివరాత్రి శోభ