దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అన్నారు. దివ్యాంగులను అన్ని విధాల ఆదుకునేలా కృషి చేస్తోందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాలు అందజేయడానికి ఎంపిక చేయడం కోసం ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జిల్లాలోని దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్, కాలిపర్స్, కృత్రిమ కాళ్లు అందజేయటానికి ఈ ఎంపిక శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అనేక రకాలుగా సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. నెలకు రూ.3,016 పింఛన్ అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. 2016లో కేంద్రం తీసుకొచ్చిన దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికీ ప్రాధాన్యం కల్పించేలా చూస్తామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య వారధిగా ఉంటామని వాసుదేవరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, అదనపు కలెక్టర్ ఆర్.అంజయ్య, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ ఎన్.అరుణ, మున్సిపల్ ఛైర్ పర్సన్ జిందం కళ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఇకపై హైదరాబాద్ టూ అమెరికా నాన్‌స్టాప్ విమానం!