ప్రకృతి ప్రతాపంతో రైతుల ఇబ్బందులు వర్ణనాతీతం(Farmers Suffering_ అయ్యాయి. వరుసగా కురుస్తున్న అకాల వర్షాలతో (Heavy rain) చేతికొచ్చిన పంట నీటి పాలయ్యింది. రాజన్న సిరిసిల్ల (rajanna sircilla) జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రంలో రైతులు ఆరబెట్టిన వరి ధాన్యం(Paddy Procurement) పూర్తిగా తడిసి ముద్దయింది. వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు రైతులు టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ఈదురు గాలులకు లేచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 40 నిమిషాల పాటు రుద్రంగి మండల కేంద్రంలో భారీ వర్షం కురిసినట్లు తెలిపారు.
అమ్మకం కోసం ఎదురుచూస్తున్న సమయంలో...
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో కరీంనగర్ జిల్లా (karimnagar district) గంగాధర మండలంలో సైతం చేతికొచ్చిన పంట నీటి పాలయ్యింది. ధాన్యం రాశులుగా పోసుకుని నెలరోజులుగా అమ్మకం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. అకాల వర్షాలతో తీవ్రనష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ భారీ వర్షాలతో వరద పెరిగి ధాన్యం కొట్టుకుపోయిందని తెలిపారు.
ధాన్యం కొనుగోలులో జాప్యం వల్లే...
రంగారెడ్డి జిల్లా (rangareddy) చేవెళ్ల మండలంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వర్షం రైతులను నష్టాలపాలు చేసింది. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టినా ధాన్యం తడిసింది. మొక్క జొన్న రైతులకు సైతం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. దీంతో ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఆరుగాలం పండించిన పంట నీటి పాలయ్యిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేమ పేరుతో రోజుల తరబడి ఆరబెట్టడం వల్లే తమ పరిస్థితి ఇలా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నివారిస్తే మేలు జరుగుతుందని రైతులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వడ్లను ఆరబెట్టేందుకు స్థలం లేక, వర్షం వస్తే కుప్పలపై కప్పేందుకు టార్పాలిన్ కవర్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే కల్లాల్లో తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
టార్పాలిన్ ఇబ్బందులు...
వర్షం నుంచి ధాన్యాన్ని రక్షించేందుకు ఉపయోగించే టార్పాలిన్ కవర్లను సబ్సిడీపై ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. వేల రూపాయలు పెట్టి టార్పాలిన్ కొనే స్థోమత లేక వర్షాలు పడే సమయంలో ధాన్యాన్ని కాపాడుకోలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సబ్సిడీపై ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
రోజుల తరబడి ధాన్యాన్ని ఆరబెట్టుతున్నాం. ఇంకా ఎండలే... ఎండలే అంటూ కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడేమో అకాల వర్షాలు కురిసి చేతికొచ్చిన పంట నీటి పాలయ్యింది. మాకు పెట్టిన పెట్టుబడి కూడా రాదు. -యాదయ్య, బాధిత రైతు
ఇదీ చదవండి: Paddy Procurement in Telangana: కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం.. కొనేదెప్పుడు?