ఎదురుగా పోలీసులు వస్తుంటే అమ్మో అనుకుంటాం. ఏ తప్పు చేయకపోయినా వాళ్లు కనిపిస్తే భయంతోనో, గౌరవంతోనే పక్కకు తప్పుకుని పోతుంటాం. వాళ్లతో మాట్లాడటానికి కూడా జంకుతుంటాం. వాళ్ల చేతిలో ఉండే లాఠీ, వృత్తి రీత్యా వారి ముఖాల్లో కనిపించే గాంభీర్యమే అందుకు కారణం. కానీ తప్పు చేసిన వాళ్ల పట్ల కఠినంగా వ్యవహరించడమే కాదు.. అమాయకుల పట్ల, ఏ ఆదరణ లేని వాళ్ల పట్ల మానవత్వం కూడా చూపించడం తెలుసంటున్నారు ఈ ఆర్ఐ..
సమాజంలో మానవత్వం ఇంకా బతికే ఉందనేదానికి ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట కొన్ని సంఘటనలు తారసపడుతుంటాయి. తాము సంపాదించే దానిలో అంతో ఇంతో నిరుపేదలకు, ఆదరణ లేని వారిని ఇస్తూ దానగుణం చాటుకుంటున్నారు కొందరు. ఆ కోవకు చెందిన వారే ఈ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆర్ఐ కుమారస్వామి.
20మందికి పంపిణీ
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చలి తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న యాచకులకు దుప్పట్లు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు ఆర్ఐ కుమారస్వామి. 20 మంది యాచకులను గుర్తించి వారికి శనివారం రాత్రి రగ్గులు అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో లాఠీ కాఠిన్యం చూపడమే కాదు.. తమలోనూ మానవత్వం దాగి ఉందని కుమార స్వామి నిరూపించారు. ప్రజల రక్షణకే కాకుండా వారి కష్టసమయంలోనూ తోడుగా ఉంటామని ఆర్ఐ అన్నారు. ఈ చలికాలంలో యాచకులకు తమ వంతుగా సహకారం అందజేయడం ఆనందంగా ఉందని వెల్లడించారు.
ఇదీ చదవండి: Police accident today: లారీని ఢీకొన్న పోలీసు వాహనం.. ఏఎస్సై పరిస్థితి విషమం