పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని... దానికోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వేములవాడ పట్టణ పోలీస్స్టేషన్లో అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా మొక్కలు నాటుతున్నట్లు ఎస్పీ తెలిపారు.
చెట్లను మానవాళి అవసరాల కోసం నరికివేయడం, అందుకు అనుగుణంగా మొక్కల పెంపకం చేపట్టకపోవడం కారణంగా కరవు పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటడాన్ని ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఐలు వెంకటేశ్, నవీన్ కుమార్, ఎస్సైలు నరేశ్ కూమర్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.