Paddy Filling Machine By Abhishek in Sircilla : సృజనాత్మకతో ఆలోచిస్తే విద్యార్థిగా ఉన్నప్పుడే ఏ ఆవిష్కరణలైనా చేయవచ్చని నిరూపిస్తున్నాడు అభిషేక్. తన ప్రయత్నంతో తోటి విద్యార్థులకు స్పూర్తిగా నిలుస్తున్నాడు. రైతుల కోసం తాను ఒక యంత్రం కనిపెట్టడమే గాక పేటెంట్ హక్కులూ సాధించాడు. చిన్నవయసులోనే అద్భుత ఆవిష్కరణతో అబ్బురపరుస్తున్నాడు ఈ యువ ఆవిష్కర్త.
Student Designs Paddy Filling Machine : ఈ యువకుడి పేరు అభిషేక్. రాజన్నసిరిసిల్ల జిల్లా హన్మాజిపేట స్వస్థలం. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. ప్రస్తుతం మల్లారెడ్డి కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో తండ్రితో పాటు వ్యవసాయ పనులకు వెళ్లేవాడు. అదే సమయంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సాహమూ అభిషేక్‌కు ఎక్కువే. తరచూ ఏదోకటి తయారుచేసేందుకు ప్రయత్నించేవాడు. అలా నూతన ఆవిష్కరణలపై ఇష్టం పెంచుకున్నాడు.
Sircilla Young Man Invented Paddy Filling Machine : ఖాళీ సమయాల్లో తండ్రి వెంట ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లేవాడు అభిషేక్. ధాన్యం సంచుల్లోకి నింపేందుకు వారు విపరీతంగా శ్రమించడం గమనించాడు. పరిష్కారంగా ఏదైనా యంత్రం తయారుచేస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు. ఆలోచనను అమలులో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. పట్టువిడవకుండా తను అనుకున్న ఆవిష్కరణకు ఒక రూపమిచ్చాడు అభిషేక్.
ప్యాడీ ఫిల్లింగ్ యంత్రం కనిపెట్టే నాటికి అభిషేక్ చదువుతున్నది 8వ తరగతే. మొదట దానిని పాఠశాలలో ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. తర్వాత జిల్లా స్థాయి ఇన్ స్పైర్ ఎగ్జిబిషన్‌లో ఈ యంత్రాన్ని ప్రదర్శించి మొదటి బహుమతి గెల్చుకున్నాడు. ఆ విజయం తనలో రెట్టింపు ఉత్సాహం నింపింది. తర్వాత దాన్నే మరింత మెరుగ్గా తీర్చిదిద్దాడు.
తాత కష్టం చూసి చలించింది.. కొత్త యంత్రం ఆవిష్కరించింది
అభిషేక్ కనిపెట్టిన ఈ యంత్రం కేవలం వడ్లే కాకుండా ఇతర ధాన్యాలనూ సులభంగా సంచుల్లో నింపేందుకు ఉపయోగపడుతుంది. సన్నకారు రైతులూ కొనుగోలు చేయగలిగేలా తక్కువధరకే ప్యాడీ యంత్రం తీర్చిదిద్దాడు అభిషేక్. దీనికి 10 ఏళ్లకు పైనే పనిచేసే సామర్థ్యం ఉందనీ అంటున్నాడు. ఇప్పటి వరకు వివిధ ఎగ్జిబిషన్ పోటీల్లో అనేక బహుమతులు సాధించాడు అభిషేక్. జిల్లా స్థాయిలో మొదటి బహుమతితో పాటు మెరిట్ అవార్డునూ సొంతం చేసుకున్నాడు. ఐఐటీ దిల్లీలో జరిగిన జాతీయ స్థాయి ప్రదర్శనలో తృతీయ స్థానంలో నిలిచాడు. ఎన్‌ఐటీ వరంగల్‌లో రోబోటిక్స్‌లో నెల రోజుల పాటు శిక్షణ తీసుకునే అవకాశం పొందాడు.
'ఈ యంత్రం ద్వారా వరి ధాన్యాలను సంచుల్లో సులువుగా నింపోచ్చు. దీంతో వరి ధాన్యాలను నింపి కింద వెయిట్ మేషిన్ ఉంటుంది, అందులో వెయిట్ చెక్ చేసుకోని లారీలలోకి లోడ్ చేసుకోవచ్చు. కేవలం అయిదు నిమిషాలలోనే ఒక సంచిని నింపోచ్చు. ఈ యంత్రంతో కేంద్రాల్లో సులువుగా పని అయిపోతుంది. ఈ యంత్రం రైతులకు బాగా ఉపయోగపడుతుంది.' -అభిషేక్, ప్యాడీ ఫిల్లింగ్ యంత్రం ఆవిష్కర్త
Paddy Filling Machine in Sircilla : అభిషేక్ చేసిన ఈ ప్రయత్నం ద్వారా తమ పాఠశాలకు మంచి పేరు వచ్చిందని, తక్కువ ధరకే రైతులకు మేలుచేసే ఈ యంత్రం రూపొందించడం సంతోషం ఇస్తోందంటున్నాడు అభిషేక్ ఉపాధ్యాయుడు. రైతులపై అదనపు భారం తగ్గించే ఉద్దేశంతో ఈ యంత్రాన్ని కనిపెట్టాడు అభిషేక్. ప్రస్తుతం ఈ యంత్రం ధర రూ.13 నుంచి రూ.14 వేల వరకు ఉంటుంది. భవిష్యత్‌లో మరింత తక్కువ ధరకే అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.