ప్రాజెక్ట్ చరిత్రలో తొలిసారి వానాకాలం పంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగువ మానేరు జలాశయం నుంచి నీరు విడుదల చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే కాళేశ్వరం జలాలతో వేసవిలోనే నిండు కుండలా మారిందని పేర్కొన్నారు. జూలై మొదటి వారంలోనే నీరు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.
ప్రస్తుతం ఎగువ మానేరులో 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జలాశయం కింద దాదాపు 13 వేల ఎకరాల చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్నారు. నీరు విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వానాకాలంలోనే పంటలకు నీరందిస్తున్నందుకు సిరిసిల్ల రైతుల తరఫున మంత్రి కేటీఆర్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.