Minister KTR latest news : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు, సిరిసిల్ల పట్టణంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం గోరంట్యాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డిపేటలో రూ.8.5 కోట్లతో అభివృద్ది చేసిన విద్యా క్యాంపస్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 'విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం ఉంటుందని.. అది ఒక తరగతి గది కాదని.. ఒక విజ్ఞానపు గని' అని పేర్కొన్నారు.
తరగతి గది నాలుగు గోడలు భారతదేశ భవిష్యత్‌కు మూలస్తంభాలని చెప్పుకొచ్చారు. తెలంగాణ తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానంలో సరికొత్త విద్యా విప్లవం తీసుకొచ్చామని మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిగతా రాష్ట్రాల్లో డ్రాప్ అవుట్‌లు పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం డ్రాప్ ఇన్‌లు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోందని పునరుద్ఘాటించారు.
అమెరికాలో ఎక్కడికి వెళ్లినా మన తెలుగు వారు కలుస్తుంటారని గుర్తు చేసుకున్న కేటీఆర్.. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో చదివి అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వాళ్లు ఎక్కువగా ఉంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల క్రితం రాష్ట్రంలో పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో రైతు బంధు, దళిత బంధు పథకాలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గంభీరావుపేటలో కేజీ టు పీజీ కళాశాల నిర్మించామని పేర్కొన్నారు.
- KTR Tweet On Palle Pragathi Day : ఆదర్శ గ్రామాలకు కేరాఫ్ అడ్రస్ 'మన తెలంగాణ'
- KTR on Women Welfare Celebrations : 'ఆకాశంలో సగం కాదు.. 'ఆమే' ఆకాశం'
KTR on Gorantyala School opening program : రాష్ట్రంలో 12 రకాల సౌకర్యాలతో మూడు దశల్లో పాఠశాలలు నిర్మిస్తున్నామని ప్రకటించారు. మొదటి దశలో రూ.7వేల 300కోట్లతో ఈ ఆగస్టులోగా పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మరో రెండు విడతల్లో మిగిలిన పాఠశాలల్లో పనులు పూర్తి చేసి నాణ్యమైన విద్యను అందిస్తామని వెల్లడించారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి పాఠశాలల్లో టీ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ వ్యవస్థ ద్వారా విద్యార్థులకు పాఠాలు అందిస్తామని పేర్కొన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి అందరూ కలిసి ముందుకు రావాలని సూచించారు.
ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలని గుర్తు చేశారు. ప్రజల దయ ఉంటే మళ్లీ ఎమ్మెల్యేగా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లాలోని 1000 మంది దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను అందజేశారు. అనంతరం పట్టణంలోని రాజీవ్‌నగర్ మినీ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడకారులకు సూచనలు చేశారు. యువత క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు.
"తొమ్మిదేళ్ల క్రితం పరిస్థితులు.. ప్రస్తుత పరిస్థితులపై ప్రజలు ఆలోచించాలి. తొమ్మిదేళ్ల క్రితం రైతు బంధు, దళిత బంధు ఉందా? ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కళాశాల కచ్చితంగా వస్తుంది. గంభీరావుపేటలో కేజీ టు పీజీ కళాశాల కట్టాం. 12 సౌకర్యాలతో పాఠశాలలు ఏర్పాటు చేస్తాం.మూడు దశల్లో ఏర్పాటు చేస్తాం. రూ.7,300కోట్లతో మొదటి దశలో పనులు పూర్తి చేస్తున్నాం. విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించాలి. నాలుగు గోడలే.. దేశ భవిష్యత్తుకు మూలస్తంభాలు. రాష్ట్ర ప్రభుత్వం.. యావత్ దేశానికే పాఠాలు నేర్పుతోంది. మిగతా రాష్ట్రాల్లో డ్రాప్-అవుట్‌లు.. తెలంగాణలో మాత్రం డ్రాప్- ఇన్‌లు"- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ఇవీ చదవండి: