రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. రాచర్ల బొప్పాపూర్‌లో నియంత్రిత సాగు విధానంపై స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులు, పాక్స్ ఛైర్మన్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రులు పాల్గొన్నారు.
సిరిసిల్లను గోదారమ్మతో అభిషేకిస్తాం !
కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 9,10,11,12 లను పూర్తి చేసి అక్టోబర్‌లోగా రాజన్న సిరిసిల్ల జిల్లాను గోదావరి జలాలతో అభిషేకిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. గోదారమ్మను 500 మీటర్ల ఎత్తుకు తీసుకువచ్చి రైతుల భీడు భూములను సస్యశ్యామలం చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినప్పుడు మొదట విమర్శిస్తారని... మనమంతా సంఘటితమైతే విజయం సాధిస్తామని మంత్రి చెప్పారు.
ఇబ్బందులున్నా అధిగమిస్తున్నాం...
కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ... ఇబ్బందులను అధిగమిస్తున్నామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో 90 శాతం రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటకు రైతుబంధు కింద ఏడు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.
రుణమాఫీకి సంబంధించి 5 లక్షల 50 వేల మంది రైతులకు 1200 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని ఆయన గుర్తు చేశారు. ఎరువులు, విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్, సాగునీరు రైతులకు అందిస్తుందన్నారు.
ఇవీ చూడండి : 'నచ్చిన పంట సాగు చేసుకునే స్వేచ్ఛ రైతులకు లేదా?'