రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని చేపల మార్కెట్ ప్రాంగణంలో గూడెం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్ల సమావేశం నిర్వహించారు. గూడెం మత్స్య పారిశ్రామిక సహకార సంఘం 1954లో రిజిస్ట్రేషన్ అయ్యిందని... ఆనాటి నుంచి ముస్తాబాద్ పరిధిలోని అనేక మత్స్య సహకార సంఘాల్లో గంగపుత్రులతోనే కొనసాగుతుందని సొసైటీ నేత పూస నర్సయ్య బెస్త గుర్తు చేశారు. అనాదిగా ఇక్కడ చేపలు పట్టేది గంగపుత్ర కులస్తులేనని... ఇప్పుడు ఆ హక్కును ఇతర కులాలకు ఇవ్వాలని ప్రభుత్వం యత్నించడం దారుణమని నర్సయ్య ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఇతర కులాల హక్కులను అడగట్లేదని... కొత్త జీఓల పేరిట తమ మత్స్య వృత్తి జోలికి మాత్రం ప్రభుత్వం రాకూడదన్నారు.
'జీఓ నెం.6ను రద్దు చేస్తేనే మాకు న్యాయం'
జీఓ నెం.6ను రద్దు చేస్తేనే సాంప్రదాయ మత్స్యకార కులాలకు ప్రభుత్వం న్యాయం చేసినట్లవుతుందని మత్ససహకార సంఘం డైరెక్టర్ గడ్డమీది మల్లేశం బెస్త అన్నారు. ఇదే విషయమై త్వరలోనే సీఎం కేసీఆర్, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను కలుస్తామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో తమ సొసైటీల్లో ఇతర కులాలను భాగం చేయబోమని గూడెం, ఆవునూరు, నామాపురం , చీకోడు, కొండాపూర్ మత్స్యసహకార సంఘాల డైరెక్టర్లు, అధ్యక్షులు తీర్మానించారు. హక్కులను కాపాడమని ప్రభుత్వాన్ని కోరుతామని తీర్మానం చేసినట్లు వారు తెలిపారు. సమావేశంలో మత్ససహకార సంఘం నేతలు, వివిధ గ్రామాల గంగపుత్రులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందంటే?