వానరం జాతి వైరాన్ని మరిచి కుక్క పిల్లకు పాలిచ్చి అమ్మ ప్రేమను పంచింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలోకి ఓ కోతి... ఇంకా కళ్లు కూడా తెరవని కుక్కపిల్లను ఎత్తుకు వచ్చింది. పసికూనను పట్టుకుని చెంగు చెంగున గోడలపై నుంచి దూకుతుంటే స్థానికులు అవాక్కయ్యారు.
కుక్కపిల్ల ఎక్కడ కింద పడిపోతుందోనని కంగారు పడి కేకలు వేశారు. ఈ రెండింటినీ విడదీసేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోతి మాత్రం ఏమాత్రం భయపడకుండా తన గుండెలకు హత్తుకుని పరుగెత్తడమే కాకుండా పాలిచ్చి ఆకలిని సైతం తీర్చింది. జాతి వైరాన్ని విస్మరించి కుక్కపిల్లపై వానరం చూపే తల్లిప్రేమ చూడముచ్చటగా ఉందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: మంచి ఆరోగ్యానికి మేలిమి అలవాట్లు