రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భాజపా తరఫున ఆందోళను చేపట్టి.. ఛార్జీల పెంపును అడ్డుకుంటామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగ సభలో పాల్గొన్నారు.
ఉద్యమాలు చేయండి..
ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. అక్టోబర్ 2 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలుకోసం ఆందోళనలు చేస్తామన్నారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మేందుకు.. కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఆర్టీసీ కార్మికులు మేల్కొని.. ఉద్యమాలు చేయాలని సూచించారు.
భాజపా కార్యకర్తలను ఇబ్బంది పెట్టొద్దు..
ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చేసి ఓర్వలేకే పోలీసుల ద్వారా తమ సభలను అడ్డుకొనే ప్రయత్నం చేస్తోందని ప్రభుత్వంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ.. తెరాస కొమ్ముకాసేలా ఉందని ఆరోపించారు. ఇకనైనా భాజపా కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నానన్నారు.
సర్పంచ్‌లను ఇబ్బంది పెడుతున్నారు..
రాష్ట్రంలో స్థానిక సంస్థలు నిర్వీర్వమవుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. సర్పంచులను చెక్‌పవర్ పేరుతో బెదిరిస్తున్నారని.. అనర్హత వేటు వేస్తామని కలెక్టర్లతో భయపెడుతున్నారని సంజయ్ ఆరోపించారు. అందుకే సర్పంచులు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదన్న.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్.. గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివేనన్నారు.
ప్రతి గింజా కొనిపిస్తాం..
రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని సంజయ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మెడలు వంచైనా సరే ప్రతి గింజా కొనేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామన్నారు. నిజంగా రైతులకు అన్యాయం జరిగితే దిల్లీకి వెళ్లి ప్రధానిని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. కృష్ణా నీటి కేటాయింపుల్లో 299 టీఎంసీల నీటికే అంగీకరించి.. కేసీఆర్ ద్రోహం చేశారని సంజయ్ ఆరోపించారు.
నిలువ నీడ లేదంటున్నారు..
పాదయాత్రలో తనను కలిసిన పేద ప్రజలు నిలువనీడ లేదని చెప్పుకుంటూ ఏడుస్తున్నారన్న సంజయ్... ముస్తాబాద్ మండలంలో ఎంత మందికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారో చెప్పాలని.. మంత్రి కేటీఆర్‌ను డిమాండ్ చేశారు.
ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు..
పేదరిక నిర్మూలన కోసం.. భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం కోసం.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రజాసంక్షేమాన్ని విస్మరించాలని విమర్శించారు.
ఇదీచూడండి: CM KCR Delhi Tour: దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. మూడ్రోజుల పాటు పర్యటన