మధ్య మానేరు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం కన్న ఊరిని.. ఉన్న ఇంటిని..అప్పగించిన నిర్వాసితుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు రాని పక్షంలో వేలాదిమంది నిర్వాసితులతో జనవరి మొదటి వారంలో 'ఛలో హైదరాబాద్' కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ధైర్యం ఉంటే ముంపు గ్రామాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. 'ఛలో హైదరాబాద్' కార్యక్రమంలో భాగంగా ముంపు గ్రామాల బాధితులతో కలసి గవర్నర్‌ను కలవనున్నట్లు చెప్పారు.
ఈ నెల 14న ఆందోళనలు
ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ప్రజా ప్రతినిధి(ఎమ్మెల్యే) గత 8 నెలలుగా పత్తా లేకుండా పోయారని విమర్శించారు. ఈ నియోజకవర్గం అనాథగా మారిపోయిందని, ప్రజల బాగోగులు పట్టించుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వేములవాడ దేవాలయ అభివృద్ధి పనులకు సంబంధించి గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని, తమకు ఇప్పటికైనా ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర ప్రభుత్వ పథకాల్లో చేర్పించి నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తానన్నారు. ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల సమస్యలపై ఈనెల 14న తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని తెలిపారు. అటు సన్నరకం ధాన్యానికి మద్దతుధర, లక్ష రూపాయల రుణమాఫీ అమలు, రైతుబంధు నిధుల చెల్లింపుకు క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మభ్యపెట్టేందుకే...
ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచేస్తున్నాడని బండి ఆరోపించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టంపై కొన్ని పార్టీలు ఇచ్చిన బంద్‌కు మద్దతు తెలిపి నిరసన ప్రకటించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టానికి రైతులు బ్రహ్మరథం పడుతున్నారని, ఓర్వలేని ప్రతిపక్షాలు రైతుల పేరిట నిరసన చేస్తున్నారన్నారు.
ఇదీ చూడండి: సీఎం , అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు : రఘునందన్