పంటల సాగులో నూతన పద్ధతులు అవలంభిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న అన్నదాతలను ఘనంగా సన్మానించారు. చెన్నాడి మార్తాండరావు స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో రైతులను గౌరవించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్రాంత రిజిస్ట్రార్ జగపతిరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
రాష్ట్రంలో 150 రకాల పంటలు సాగు చేసేందుకు భూములు అనుకూలంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త పంటల సాగులో రైతులు క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించాలని సూచించారు. మేలైన సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తే లాభాలు పొందవచ్చని తెలిపారు.
వరిసాగుతో సవాళ్లు తప్పవు:
రైతులు సంఘటితమై తమ పంటలను మార్కెట్కు అనుగుణంగా విక్రయించుకుంటే మరింత లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. సన్నవరి సాగుతో రానున్న రోజుల్లో ధాన్యం కొనుగోలు సవాలుగా మారుతుందని తెలిపారు. వ్యవసాయంలో సేంద్రీయ పద్ధతి అవలంభించడాన్ని రైతులు సానుకూలంగా మలచుకోవాలని జగపతిరావు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్ రెడ్డి, చెన్నాడి మార్తాండరావు స్మారక ట్రస్ట్ ఛైర్పర్సన్ చెన్నాడి రాజలక్ష్మి, డాక్టర్ మాధవి, భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు పాల్గొన్నారు.