పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద నిర్మించిన పార్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరికి అనుసంధానంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ జలాశయం 20 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని వదిలినట్టు అధికారులు తెలిపారు. ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో నీటి ఉద్ధృతి పెరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని దిగువకు వదులుతున్నారు.
25 రోజులుగా సరస్వతి పంప్ హౌస్‌లోని 8 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. పార్వతి బ్యారేజ్ నీటితో నిండుకుండలా కళకళలాడుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందు జాగ్రత్తగా మూడు రోజులుగా మోటార్లు ఆఫ్ చేసి నీటి ఎత్తిపోత నిలిపివేశారు. పార్వతి బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 7.24 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. బ్యారేజ్ గేట్లు ఎత్తేయడం వల్ల పరివాహక ప్రదేశాల్లో ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.