Vande Bharat Train to Secunderabad to Nagpur : వందే భారత్ రైలును సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాగ్‌పూర్ స్టేషన్ మధ్య నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ మార్గంలో వందే భారత్ రైలు ప్రవేశపెట్టడం ద్వారా.. దాదాపు నాలుగు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. మరోవైపు సుమారు 580 కి.మీ దూరం ఉండే ఈ మార్గంలో ఇప్పటికే 30 వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందుకు ప్రస్తుతం గరిష్ఠంగా 10 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్‌తో ఆరు గంటల్లోనే గమ్య స్థానానికి చేరుకునే అవకాశాలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలోనే సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ వెళ్లేందుకు వయా కాజీపేట, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్, సిర్పూర్ స్టేషన్లలో రైలు హాల్టింగ్ ఉండే అవకాశముంది. ఇందులో భాగంగానే ఈ మార్గాల మధ్య వందే భారత్ రైలు ట్రయల్ రన్‌ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇందుకోసం ఏ స్టేషన్‌లోనూ వందే భారత్ రైలును ఆపకుండా ట్రయల్ రన్‌ను పూర్తి చేశారు. ఇప్పటికే 18 మార్గాల్లో ఈ రైళ్లను నడిపిస్తుండగా.. సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గం 19వది కానుంది.
త్వరలోనే దక్షిణ మధ్య రైల్వే అధికారులు వందే భారత్ రైలు రాకపోకల షెడ్యూల్‌ను కూడా అధికారికంగా ప్రకటించనున్నారు. మరోవైపు పెద్దపల్లి జంక్షన్‌లో ఈ రైలుకు హాల్టింగ్ లేదు. దీంతో ఇక్కడి నుంచి బల్లార్షా, మహారాష్ట్ర, నాగ్‌పూర్ వాసులు, నిత్యం వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించే వారు అసంతృప్తికి లోనవుతున్నారు. ఇప్పటికైనా దక్షిణ మధ్య రైల్వే ఈ జంక్షన్‌లో రైలు ఆపేలా చర్యలు తీసుకుంటే నిజామాబాద్,ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ప్రయాణికులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Secunderabad to Tirupati Vande Bharat Train : ఇటీవలే ప్రధాని మోదీ సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రారంభించారు. సాధారణంగా మిగతా రైళ్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య చేరుకునేందుకు.. దాదాపు 12 గంటల సమయం పడుతుంది. కానీ గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మాత్రం దాదాపు 8:30 గంటల్లోనే చేరుకుంటుంది. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో ఆ రైలు అగుతుందని రైల్వేశాఖ వెల్లడించింది. తొలుత ఎనిమిది కోచ్‌లతోనే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించనున్నట్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే... అందులో ప్రస్తుతం 7 ఏసీ ఛైర్‌కార్ కోచ్‌లు, 1 ఏసీ ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటుందని వివరించింది. తిరుపతి-సికింద్రాబాద్ వందేభారత్‌లో అందుబాటులో 530 సీట్లు ఉంటాయని పేర్కొన్నారు. రద్దీకి అనుగుణంగా భవిష్యత్‌లో కోచ్‌లను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.