పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఆర్జీ-2 ఏరియాలోని వకీల్‌పల్లె బొగ్గు గనిలో గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఓవర్‌మెన్ నవీన్ మృతి చెందగా.. నలుగురు కార్మికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొదటి షిఫ్ట్‌లో విధులకు వెళ్లిన నవీన్ గురువారం 3 గంటల సమయంలో గనిలో బొగ్గు పైకప్పు కూలడంతో బొగ్గు పొరల కింద కూరుకుపోయాడు. అక్కడే ఉన్న మరో నలుగురు కార్మికులు పరుగులు తీయడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

10 ఫీట్ల పొడవు, ఐదు ఫీట్ల వెడల్పు బొగ్గు పొరల కింద నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సింగరేణి రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమించి.. శుక్రవారం తెల్లవారుజామున మూడున్నర గంటలకు నవీన్ మృతదేహాన్ని బయటికి తీశారు. గోదావరిఖని సింగరేణి ఆసుపత్రికి తరలించి.. పోస్టుమార్టం నిర్వహించారు.
కార్మిక సంఘాల ఆందోళన..
బొగ్గు గని ప్రమాదంలో మరణించిన నవీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కార్మిక సంఘాల నాయకులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగాయి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి, రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గని ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, పని వేళలు మార్చడం, గనిలో రక్షణ చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఘటనపై డైరెక్టర్ జనరల్ మైన్ సేఫ్టీ అధికారులచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మృతదేహం అప్పగింత..
నవీన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పెద్దపల్లి జిల్లా కాచాపూర్ గ్రామానికి చెందిన నవీన్ 2013లో సింగరేణి ఉద్యోగం సాధించాడు. ఈ ఏడాది ఆగస్టులో ప్రేమ వివాహం చేసుకున్న నవీన్.. ప్రమాదంలో మరణించడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
పరామర్శ..
మరోవైపు నవీన్ కుటుంబసభ్యులను సింగరేణి సంస్థ డైరెక్టర్ (పరిపాలన) చంద్రశేఖర్‌తో పాటు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరామర్శించారు. సంస్థ పరంగా అన్ని విధాలా సహకారాలు అందిస్తామన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.