SINGARENI CMD SRIDHAR: పెద్దపల్లి జిల్లా రామగుండం-3లో జరిగిన ప్రమాదంపై సింగరేణి యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంస్థ సీఎండీ శ్రీధర్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది గనిలోకి వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన ఆరుగురిలో ముగ్గురిని రక్షించామని తెలిపారు. మిగతా వారిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండాపోయిందని సీఎండీ ఆవేదన వ్యక్తంచేశారు.
కార్మికుల రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ తెలిపారు. ప్రమాదం జరగడం అత్యంత బాధకరమని , ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు సంస్థ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
వారికి చెల్లించాల్సిన సొమ్మును వెంటనే వారి కుటుంబ సభ్యులకు అందజేస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబాల్లో అర్హులైన వారికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగమిస్తామని ప్రకటించారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా అన్ని గనుల్లో రక్షణ తనిఖీలు నిర్వహించి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎండీ శ్రీధర్ ఆదేశించారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే..
బొగ్గుగనిలో సపోర్టుగా ఏర్పాటుచేసే పిల్లర్ తొలగించడంతో ప్రమాదం చోటుచేసుకుంది. గనుల్లో ఒత్తిడి తట్టుకునేందుకు బొగ్గు తవ్వే మార్గంలో పైకప్పునకు దన్నుగా పిల్లర్లను ఏర్పాటు చేస్తారు. అడ్రియాల గనిలో 86 నుంచి 87 లెవల్ వరకు ఉండాల్సిన మూడు పిల్లర్లలో.. మధ్యలో ఉన్నదాన్ని తొలగించారు. దీంతో పైకప్పు ఒత్తిడికి గురై 20 రోజుల క్రితం పడిపోయింది. కూలిన ప్రాంతాన్ని సరిచేసేందుకు పనులు చేపట్టిన కొద్ది గంటల్లోనే.. మళ్లీ కూలి సిబ్బందిపై పడటంతో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగిన రోజే ఇద్దరు సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. నిన్న(మార్చి 8న) సాయంత్రం.. బదిలీ వర్కర్ రవీందర్‌ను సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తుండగా... అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ విగతజీవిగా కనిపించారు. శిథిలాల కింద చిక్కుకున్న మరో ఇద్దరు.. సేఫ్టీ మేనేజర్ జయరాజ్, ఒప్పంద కార్మికుడు శ్రీకాంత్ మృతి చెందారు.
ఇదీ చదవండి: సింగరేణి యాజమాన్యంతో చర్చలు విఫలం.... ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత...