తెలంగాణ మహా కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని.. ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ఇబ్బందులు పడకుండా.. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సురక్షితంగా అమ్మవారిని దర్శించుకోవాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రీజినల్ మేనేజర్ జీవన్ ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన మేడారం జాతర ప్రత్యేక బస్సు క్యాంపును ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 600 బస్సులతో భక్తులకు సేవలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెద్దపల్లి నుంచి 125, గోదావరిఖని నుంచి 140, మంథని నుంచి 140 బస్సులు నడిపించేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తుల కోసం తాగునీరు, టాయ్లెట్స్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆర్టీసీ ప్రత్యేక వాలంటీర్లతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నట్లు తెలిపారు.