RFCL Urea Production: రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో యూరియా ఉత్పత్తికి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఇటీవల కర్మాగారంలో 12 లోపాలను ఎత్తిచూపిన కాలుష్య నియంత్రణ మండలి.. వాటిని సవరించుకునేందుకు యాజమాన్యానికి గడువిచ్చింది. కర్మాగారంలో లోపాలున్నాయంటూ ఉత్పత్తి నిలిపివేయాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ యాజమాన్యం విజ్ఞప్తితో ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. యూరియా డిమాండ్ రీత్యా కర్మాగారంలో ఉత్పత్తికి అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. దీంతో కర్మాగారంలో యూరియా ఉత్పత్తిని యథావిధిగా కొనసాగించనున్నారు.
ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా వాయువు లీకై, కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదులు చేయడంతో రాబోయే 3 నెలల్లో దాన్ని అరికట్టాలని పీసీబీ షరతు పెట్టింది. దీని నుంచి నిత్యం వెలువడే కాలుష్య వ్యర్థ జలాలను గోదావరిలో వదలకుండా కర్మాగారంలోనే తిరిగి వినియోగించుకునేలా ఏర్పాటు చేసుకోవాలంది. యూరియా ఉత్పత్తిని ఆదివారం నుంచి ఆపేయగా.. పునఃప్రారంభానికి అనుమతి ఇప్పించేందుకు కృషి చేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4.52 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. అదనపు కోటా కోసం రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారి సోమవారం దిల్లీ వెళ్లి కేంద్ర ఎరువుల శాఖ అధికారులకు విన్నవించారు.
ఇవీ చదవండి: Solar power generation: థర్మల్ కేంద్రాల్లో సౌర విద్యుదుత్పత్తికి ఆదేశాలు