పెద్దపల్లి జిల్లాలోని రైతులు వానాకాలంలో వేయబోయే పంటకు సాగునీటి సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు. సాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోలు సంబంధిత అంశాలపై కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిస్తే.. జిల్లాలో ఎస్సారెస్పీ కింద డీ83, డీ86 కాల్వల ద్వారా 2.83 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు ఉత్పన్నమైతే.. కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఎస్సార్సెస్పీ ప్రాజెక్టుల్లో సాగునీరు సమృద్ధిగా ఉండేలా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా కాల్వల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వానకాలం పంట కోసం అందుబాటులో ఉన్న ఎరువులు, విత్తనాల వివరాలను ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి సమాచారం అందించాలన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వారిపై ఓ కన్నేసి ఉంచాలని, ఎక్కడికక్కడ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు పండించి తెచ్చిన ప్రతీ గింజ కొనాలని.. సకాలంలో రైతులకు నగదు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చూడండి: ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.